Hyderabad Metro Charges : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు త్వరలోనే పెరగనున్నాయి.  ఛార్జీల పెంపుపై ఇప్పటికే ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా మెట్రో ఛార్జీల పెంపు ఉండనుందని సమాచారం. ఆదాయం పెంచుకోవడంతోపాటు ప్రాజెక్ట్‌ను లాభదాయకంగా మార్చేందుకు ఎల్ అండ్ టీ వేగంగా అడుగులు వేస్తున్నాయి. మెట్రో నిర్మాణ ఖర్చు మొత్తం రూ.13 వేల కోట్లను ఎల్‌ అండ్‌ టీ సంస్థ భరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంది. కరోనా, లాక్‌డౌన్‌తో నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో, రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కమర్షియల్‌ లోన్లను ఎల్‌ అండ్‌ టీ గ్యారంటీ బాండ్లుగా మార్చి వడ్డీని 9 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించుకుంది. మరోవైపు రూ.3 వేల కోట్ల సాఫ్ట్‌ లోన్‌ ఇచ్చి ఆదుకోవాలని ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల స్పందించిందని మెట్రో వర్గాలు అంటున్నాయి. 


భూములు లీజుకు 


హైదరాబాద్ మెట్రో కోసం ప్రభుత్వం వేర్వేరు ప్రాంతాల్లోని స్థలాలను 65 ఏళ్లకు నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చింది. ఇక్కడ  రవాణా ఆధారిత అభివృద్ధి చేపట్టి ఆదాయం సమకూర్చు కోవాలనే ఒప్పందం కూడా చేసుకుంది. అయితే అభివృద్ధికి నిధులు లేకపోవడంతో ఆ భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రాయదుర్గంలోని 15 ఎకరాలను లీజుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సాఫ్ట్‌ లోన్‌, భూముల దీర్ఘ కాల లీజు ద్వారా రూ. 5 వేల కోట్లు వస్తే రుణాల భారం రూ. 8 వేల కోట్లు తగ్గుతుందని ఎల్‌ అండ్‌  టీ సంస్థ భావిస్తుంది. మరో రూ. 2-3 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 


ఉద్యోగుల సమస్యలు 


హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థ నిర్వహణ, భద్రత ఇలా కీలకమైన విధులను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. మెట్రో నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న సంస్థలు తమ పనులను పలు ప్రైవేటు ఏజెన్సీలకు సబ్‌ కాంట్రాక్టులుగా ఇస్తున్నాయి. సుమారు పదికిపైగా ప్రైవేటు ఏజెన్సీలు మెట్రో విధులను నిర్వహిస్తున్నాయి. ఈ ఏజెన్సీలు తమ ఉద్యోగులకు ఇచ్చే నెలవారీ జీతాలు,  కార్మికులు, ఉద్యోగుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, చివరకు ఏ ఏజెన్సీ ఏ విధులు నిర్వహిస్తోందన్న విషయాల్లో గోప్యత పాటించడంపై అనుమానాలకు తావిస్తోంది.  ఇటీవల మెట్రో టికెటింగ్‌ విధులు నిర్వహించే సిబ్బంది అమీర్‌పేట్‌ స్టేషన్‌ వద్ద మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఆయా ఏజెన్సీల నిర్వాకం వెలుగుచూసింది. ప్రైవేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప్పల్‌ మెట్రో డిపోలో చర్చలు కూడా జరిగాయి. పెంచిన వేతనాలు ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిస్థాయిలో చల్లార్చకపోయాయి. మెట్రో మూడు కారిడార్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉండడం, పని గంటలు, ఇతర భత్యాల విషయంలో శ్రమదోపిడీకి జరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.  


ఛార్జీల పెంపుకే మొగ్గు 


జేబీఎస్‌– ఎంజీబీఎస్, ఎల్బీనగర్‌– మియాపూర్, నాగోల్‌– రాయదుర్గం ఈ మూడు మార్గాల్లో నిత్యం 4 -4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నష్టాల నుంచి ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితులు మాత్రం కనిపించడంలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ ఎల్ అండ్ టీ సంస్థ భారంగా మారింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాఫ్ట్‌లోన్‌ అందకపోవడం కూడా మెట్రోపై నష్టాల భారం పెరుగుతోంది. ఈ కారణాలతో ఛార్జీల పెంపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఛార్జీలను రూ.10 నుంచి రూ.20లకు, గరిష్ట ఛార్జీని రూ.60 నుంచి రూ.80 లేదా రూ.100 వరకు పెంచాలని భావిస్తున్నారు. ఛార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండవని మెట్రో అధికారులు భావిస్తున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు రవాణా సదుపాయం కల్పించకపోడం, ఉచిత పార్కింగ్‌ వసతుల లేమి కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదని తెలుస్తోంది.