Hyderabad News : హైదరాబాద్  హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. 60 మంది పర్యటకులతో బయలుదేరిన బోటు సాంకేతిక కారణాలతో హుస్సేన్ సాగర్ మధ్యలో నిలిచిపోయింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ టూరిస్ట్ ఈ విషయాన్ని ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 60 మంది పర్యటకులతో నిన్న ఓ బోటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు బయలుదేరి వెళ్లింది. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో ఈదురు గాలుల దాటికి బోటు ఇంజిన్‌ ఆగిపోయింది. దీంతో టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమై నిర్వాహకులకు సమాచారం అందించారు. వెంటనే స్టీమర్‌ బోట్ల రంగంలోకి దిగి పెద్ద బోటును ఒడ్డుకు తీసుకొచ్చాయి. ఈ విషయాన్ని ఆనంద్‌ అనే వ్యక్తి  హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ అకౌంట్ లో రాశారు. ఈ ఘటనపై టూరిజం ఎండీ మనోహర్ స్పందించారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బోటు ఇంజిన్‌ స్లో చేస్తామని తెలిపారు. ఒక్కొక్కసారి స్టీమర్‌ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామన్నారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లోకి టూరిస్ట్ బోటులను అనుమతించడంలేదని తెలిపారు.  






హుస్సేన్ సాగర్ కు భారీ వరద హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ పర్యటక ప్రదేశాల్లో ఒకటి. అయితే నగరంలో కురుస్తోన్న భారీ వర్షాలకు సాగర్ కు వరదనీరు చేరుతోంది. దీంతో హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం కన్నా ఎక్కువగా వరద నీరు చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లకు నీటి మట్టం చేరింది. హుస్సేన్ సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు అని తెలుస్తోంది. అయితే గరిష్ఠ నీటిమట్టానికి మరో మీటరు దూరంలో వరద నీరు ఉంది. వర్షాలతో కూకట్‌పల్లి నాలాలో నుంచి హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన తరుణంలో తూముల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Also Read : Telangana Weather Latest: వచ్చే 5 రోజులు కుండపోతే! ఈ 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం - IMD హెచ్చరిక


Also Read : CM KCR Review: వార్ రూంలా మారిన ప్రగతి భవన్.. పొద్దస్తమానం సమీక్షలు!