Rajiv Swagruha Flats : హైదరాబాద్ లో  రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో ట్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్(2BHK), సింగిల్ బెడ్ రూమ్(1BHK), సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3న లాటరీ నిర్వహిస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఫిబ్రవరి 15 వరకు టోకెన్ అడ్వాన్స్ గా 3BHK కోసం రూ.3 లక్షలు,  2BHK కోసం రూ.2 లక్షలు, 1BHK కోసం రూ.1 లక్ష చొప్పున డిమాండ్ డ్రాఫ్టులు కట్టిన వారు లాటరీకి అర్హులని పేర్కొంది. మార్చి 3వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే లాటరీని పారదర్శకంగా దరఖాస్తుదారులు ఆన్ లైన్(ACE Media)లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది. 


మేడిపల్లి లేఅవుట్ పై అవగాహన సదస్సు 


హెచ్ఎండీఏ పరిధిలో ప్లాట్ల వేలంపై అవగాహన కల్పించేందుకు అధికారులు మేడిపల్లి ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటుచేశారు. ఈ లేఅవుట్ లో 300 చదరపు గజాల 50 ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు. మార్చి 6న ఆన్ లైన్ లో వేలం వేయనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  మేడిపల్లి మండలం పరిధిలోని హెచ్ఎండిఏ లే ఔట్ లో సోమవారం ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు లేఅవుట్ కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంజినీరింగ్, ఎస్టేట్ అధికారులు మేడిపల్లి లేఅవుట్ గురించి వివరించారు. 



హెచ్ఎండీఏ ప్లాట్ల ఈ వేలం


హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) నగర శివారులోని ప్లాట్లను మార్కెట్ రేటుకు విక్రయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఎండీఏ ప్లాట్లను ఆన్ లైన్ విధానంలో వేలం వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వేలం ప్రక్రియను నిర్వహిస్తుంది. ధరలు అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.  మూడు జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 39 ల్యాండ్ పార్సెల్స్ వేలం వేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 23  ల్యాండ్ పార్సిల్స్ వేలంలో విక్రయానికి సిద్దంగా ఉంచారు. 121 గజాల నుంచి 10,164 గజాల వరకు స్థలాలను అందుబాటు ధరల్లో ఉంచారు. 


వేలానికి 39 ల్యాండ్ పార్సిల్స్ సిద్ధం 


మార్చి 1న మొత్తం 39 ల్యాండ్ పార్సిల్స్ ను ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. అన్ని అనుమతులతో, ఎటువంటి చిక్కులు లేకుండా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ పార్సెల్స్ వేలాని సిద్ధం చేసింది. ఈ స్థలాలను కొనుగోలు చేసిన వెంటనే నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి ఈనెల 27 సాయంత్రం ఐదు గంటల వరకు ఎంఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న వారు ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటల గడువు లోపు నిర్దేశించిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రంగారెడ్ది జిల్లా గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి మండలంలో 5, ఇబ్రహీంపట్నం  మండలం పరిధిలో 2 చోట్ల ల్యాండ్ పార్సెల్స్ వేలానికి సిద్ధం చేశారు. మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలో 4, ఘట్ కేసర్ మండలంలో 1, బాచుపల్లి  మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉండగా, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలో 16, ఆర్సీ పురం మండలంలో 6, జిన్నారం మండలంలో 1 చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఆన్ లైన్ లో వేలం వేయనున్నారు.