Tarakaratna Final Rites : హైదరాబాద్ మహాప్రస్థానంలో సినీనటుడు తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. తారకరత్న అంతిమ సంస్కారాలు ఆయన తండ్రి మోహనకృష్ణ పూర్తిచేశారు. బాలకృష్ణ, నందమూరి సోదరులు తారకరత్న పాడే మోశారు. బాలకృష్ణ, చంద్రబాబు తారకరత్న వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరయ్యారు. తారకరత్న అంతిమయాత్రలో వేలాదిగా అభిమానూలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫిలిం ఛాంబర్ లో
అంతకుముందు ఫిలిం ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి వైకుంఠ రథంలో అంతిమ యాతర్ జరిగింది. వైకుంఠ రథంలో తారకరత్న పార్థివదేహాన్ని మహాప్రస్థానానకి తరలించారు. అంతిమరథంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు. తారకరత్నను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సోమవారం ఉదయం మోకిలలోని తారకరత్న స్వగృహం నుంచి భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్ ఛాంబర్ లో కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతికకాయం ఉంచారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తారకరత్నకు నివాళుల్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, తరుణ్, మురళీ మోహన్... ఇలా ఎందరో సినీ ప్రముఖులు తారకరత్న పార్థివ దేహాన్ని చివరి సారిగా చూడటానికి వచ్చారు. క్రికెట్ ఆడేటప్పుడు తారకరత్నతో ఉన్న గుర్తులను విక్టరీ వెంకటేష్ తలుచుకున్నారు. తారకరత్న కోసం ప్రత్యేకమైన పాత్ర రాయమన్నారని అనిల్ రావిపూడి తెలిపారు.
శనివారం రాత్రి తారకరత్న కన్నుమూత
నందమూరి తారకరత్నశనివారం(ఫిబ్రవరి 18) రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనం మధ్యలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే తారకరత్నను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి మరింత విషమించడంతో అదే రోజు రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు అరగంట పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. విదేశీ వైద్య బృందం సైతం ఆయన ప్రాణాలు కాపాడేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. అయినా, కాపాడలేకపోయారు. 23 రోజుల చికిత్స అనంతం శనివారం రాత్రి తారకరత్న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ నుంచి తారకరత్న భౌతికకాయాన్ని రోడ్డు మార్గం ద్వారా రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కల్మషం ఎరుగని మంచి మనిషి శాశ్వతంగా దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.