Love Today Hindi: గతేడాది నవంబర్‌లో విడుదల అయిన ‘లవ్ టుడే’ (Love Today) సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అర్చన కల్పాతి అధికారికంగా ప్రకటించారు.


ఫాంటం స్టూడియోస్, ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. 2024 ప్రారంభంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. అయితే హీరోగా ఎవరు నటించనున్నారు? ప్రదీప్ రంగనాథనే దర్శకత్వం వహిస్తాడా? అన్న వివరాలు తెలియరాలేదు.


బాక్సాఫీస్ దగ్గర ‘లవ్ టుడే’ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫలితాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తీసుకున్నారు. ఈ సినిమాకు చక్కటి ఓపెనింగ్స్ లభించాయి. రెండు వారాల పాటు మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. తెలుగులో ఈ సినిమా రూ. ఐదు కోట్లకు పైగా లాభాలు సాధించింది. మొత్తంగా మూడు వారాల పాటు ఈ సినిమా థియేటర్లలో ఆడింది.


నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ దక్కించుకున్నట్లుగానే, ఓటీటీలోనూ మంచి వ్యూస్ అందుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.


‘లవ్ టుడే’ స్టోరీ ఏంటంటే?
తమిళ నటుడు, దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తనే ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఐటీ ఉద్యోగి అయిన ఉత్తమ‌న్ ప్రదీప్ (ప్రదీప్ రంగ‌నాథ‌న్‌), నిఖిత (ఇవానా) లవ్ లో పడుతారు. వీరిద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటారు. వీరి ప్రేమ వ్యవహారం హీరోయిన్ వాళ్ల ఇంట్లో తెలుస్తోంది. ఆమె ఫాదర్ శాస్త్రి (స‌త్యరాజ్‌) ప్రదీప్ తో మాట్లాడాలి అంటాడు. ఓసారి ఇంటికి తీసుకురమ్మని కూతురుకి చెప్తాడు. అబ్బాయితో మాట్లాడాక, ఓ కండీషన్ పెడతాడు. ఒక రోజంతా ఒకరి ఫోన్ మరొకరు మార్చుకోవాలని సూచిస్తాడు. అలా ఫోన్లు మారిన తర్వాత కూడా పెళ్లికి ఓకే అంటే తానే ఇద్దరిని ఒక్కటి చేస్తానని చెప్తాడు. ఇద్దరు ఫోన్లు మార్చుకున్నాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?  ఇద్దరు ఫోన్లలో మెసేజ్ లు చూసుకున్నాక ఎలా ఫీలయ్యారు? చివరకు వీరి పెళ్లి అయ్యిందా? లేదా? అనేది స్టోరీ.


యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇవానా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.