Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ఇటీవల హైదరాబాద్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం అయింది. ఈ కేసుపై రాజకీయ నేతలు విమర్శలు చేశారు. పెద్దమ్మ త‌ల్లి ఆలయం ఆవ‌ర‌ణ‌లో సామూహిక అత్యాచారం జ‌రిగింద‌ని రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిరాధారమని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన రేవంత్ రెడ్డిపై చ‌ట్టప‌ర‌మైన చర్యలు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరారు విష్ణువర్ధన్ రెడ్డి. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతినేలా రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు. 


రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు 


పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంత‌రం మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతగా కాకుండా, పెద్దమ్మ త‌ల్లి ఆలయం ఫౌండర్ గా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి గుడి ఆవ‌ర‌ణ‌లో గ్యాంగ్ రేప్ జ‌రిగింద‌ని ఆరోపించారు. ఆ ఘ‌ట‌న పెద్దమ్మ గుడి  వెనకాల ఉన్న కాల‌నీలో జ‌రిగింద‌ని పోలీసులు కూడా నిర్ధారించారని విష్ణువ‌ర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సరైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని హితవు పలికారు.  


తప్పుడు ఆరోపణలు 


ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ఓ ప‌బ్ వ‌ద్ద బాలిక‌ను అప‌హ‌రించి కారులో సామూహిక అత్యాచారం చేశారు కొందరు యువకులు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన రేవంత్ రెడ్డి అత్యాచార ఘ‌ట‌న జూబ్లీహిల్స్ ప‌రిధిలోని పెద్దమ్మ గుడి ఆవ‌ర‌ణ‌లో జ‌రిగింద‌ని వ్యాఖ్యానించారు. ఈ ఆరోప‌ణ‌ల‌ు వివాదానికి దారితీశాయి. దీనిపై స్పందించిన విష్ణువ‌ర్ధన్ రెడ్డి శ‌నివారం బంజారా హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ దేవాల‌యంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జ‌ర‌గ‌డం లేద‌న్నారు. ఈ వ్యవ‌హారంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే స‌హించేది లేద‌ని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆల‌య ప‌రిధిలో అత్యాచారం జ‌రిగింద‌ని త‌ప్పుడు ఆరోపణలు చేసినందుకే రేవంత్ రెడ్డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌న్నారు. తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా పెద్దమ్మతల్లి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్ పై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమన్నారు.   


Also Read : Munugode Congress Candidate: మునుగోడు బైపోల్ కోసం ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్ - బీసీ నేతకు టికెట్ దక్కుతుందా !


Also Read : Ktr Setires BJP : నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు? బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్లు !