Multibagger Stocks: స్టాక్‌ మార్కెట్లు ఈ వారమంతా ఊగిసలాడాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు, ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల్లో ఒడుదొడుకులు ఇందుకు కారణం. మరోవైపు ఐరోపాలో గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. మొత్తంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఐదు శాతానికి పైగా పతనమైంది. ఫార్మా 2 శాతం తగ్గింది. అనూహ్యంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4 శాతం ఎగిసింది.


దేశీయ మార్కెట్లో బుల్స్‌, బేర్స్‌ మధ్య పోరు జరుగుతోందని జియోజిత్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అంటున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలే ఉండటం మార్కెట్లపై ఒత్తిడి పెంచుతోందని తెలిపారు. నిఫ్టీ బ్యాంకు బలంగా కనిపిస్తుండగా మార్జిన్ల తగ్గుదల, వేరియబుల్‌ పే ఇబ్బందుల వల్ల ఐటీ సెక్టార్‌పై ఒత్తిడి నెలకొందని వెల్లడించారు. కాగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఒక శాతం పెరిగాయి.


ఈ వారం బీఎస్‌ఈ 500 సూచీ మాత్రం ఎరుపెక్కింది. 290 స్టాక్స్‌ లాభపడగా మిగతావి నష్టపోయాయి. దాదాపుగా 15 షేర్లు 10 శాతానికి పైగా లాభపడ్డాయి. ఆర్బీఎల్‌ బ్యాంకు అత్యధికంగా 25 శాతం ఎగిసింది. వ్యాపార అభివృద్ధి కోసం రూ.3000 కోట్ల సేకరణకు బోర్డు అనుమతి ఇవ్వడంతో షేరు ధర రూ.124కు చేరుకుంది. దేశంలోనే అతిపెద్ద ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ కంపెనీ యూఫ్లెక్స్‌ ఈ వారం ఏకంగా 20 శాతం పెరిగి రూ.805 వద్ద స్థిరపడింది.


టెక్నికల్‌గా బలంగా ఉండటం, బ్రోకరేజీ సంస్థలు సానుకూల రిపోర్టులు ఇవ్వడంతో ఎల్గీ ఎక్విప్‌మెంట్స్‌ 17 శాతం పెరిగి రూ.493కు చేరుకుంది. టార్గెట్‌ ధర రూ.475కు చేరుకున్నా హోల్డ్‌ చేసుకోవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఐడీబీఐ బ్యాంకు షేరు ధర 15 శాతం ఎగిసి రూ.45కు చేరుకుంది. మజగాన్‌ డాక్‌, రాష్ట్రీయ కెమికల్స్‌ ఫెర్టిలైజర్స్‌, సీసీఎల్‌ ప్రొడక్స్ట్‌, కల్యాణ్ జ్యువెలర్స్‌, ఆప్టస్‌ వాల్యూ హౌజింగ్ 13-15 శాతం వరకు పెరిగాయి.


టాటా టెలీ సర్వీసెస్‌ మాత్రం 11 శాతం మేర నష్టపోయింది. షేరు ధర రూ.93కు చేరుకుంది. హ్యూస్టన్‌ ఆగ్రో షేరు 10 శాతం పతనమై రూ.1011 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ వరుసగా ఐదు సెషన్లలో నష్టపోయింది. 10 శాతం పతనమవ్వడంతో రూ.2165కు చేరుకుంది.


Also Read: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా కొన్న అంబానీ, దాని విలువెంతో తెలుసా?


Also Read: మీషో షాక్‌! గ్రాసరీ వ్యాపారం మూసివేత, 300 ఉద్యోగుల తొలగింపు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.