Munugodu By Elections: ఒక్క గెలుపు కోసం నానా తంటాలు పడుతోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఈ విజయం పార్టీకే కాదు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పొలిటికల్‌గా లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్యగా ఉంది. అందుకే గురి తప్పుకూడదు. లక్ష్యం మిస్‌ కాకూడదన్న కసితో ఆలోచనలు చేస్తూ ముందుకు పోతోంది రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం. ఈ క్రమంలో ఓ నిర్ణయానికి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రాజీనామా వ్యవహారం ఎంత హాట్‌ టాపిక్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


ప్రతిష్టాత్మకంగా మునుగోడు ఉప ఎన్నికలు
పార్టీకి కీలకమైన మునుగోడు ఉప ఎన్నికని కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హస్తం పార్టీ మాత్రమే కాదు పీసీసీ అధినేత రేవంత్‌ రెడ్డికి కూడా ఇది సెమీఫైనల్‌ లాంటిదే. ఎందుకంటే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ రేవంత్‌ ని టార్గెట్‌ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని గెలవనివ్వనని సవాల్‌ చేశారు. మునుగోడు మళ్లీ కాంగ్రెస్‌ పరమవుతుందో చూపిస్తానన్న రేంజ్‌లో రేవంత్‌ రెడ్డి శపథం చేశారు. మరోవైపు బీజేపీ కూడా మునుగోడు గెలుపు ద్వారా నల్గొండ జిల్లాలో ఖాతా తాపత్రయ పడుతోంది.. 


కాషాయం జెండా పాతుతుందా ?
కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోట అయిన జిల్లాలో కాషాయం తమ బలాన్ని విస్తరించాలనుకుంటోంది. అందుకే రాజగోపాల్‌ రెడ్డి గెలుపు కోసం తన స్టైల్‌ రాజకీయాలను మొదలెట్టింది. బీజేపీ - రాజగోపాల్‌ ఇద్దరికి ఓకేసారి చెక్‌ పెట్టాలన్న ప్లాన్‌లో ఉన్న కాంగ్రెస్‌ మునుగోడు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను ముందస్తుగా పూర్తి చేయాలన్న అధిష్టానం ఆదేశాల మేరకు గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టింది. మునుగోడుతో పాటు జిల్లాలో పట్టున్న అభ్యర్థుల లిస్టును రెడీ చేసింది. దాదాపు 10 మంది పేర్లు పరిశీలనకు రావడంతో సీనియర్ల సాయం కోరారు రేవంత్‌ రెడ్డి. 


ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్ 
ఓ వైపు హైదరాబాద్‌లో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ ఘర్షణ వాతావరణం ఉంటే.. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ మునుగోడు ఉప ఎన్నికలకు బరిలో నిలపాల్సిన గెలుపు అభ్యర్థిపై కసరత్తు మొదలెట్టింది. రాష్ట్ర- వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ తో పాటు దామోదర్‌ రాజనర్సింహ, భట్టి వంటి నేతలు సీనియర్‌ నేత జానా రెడ్డి ఇంట్లో అభ్యర్థి ఎంపికపై చర్చలు జరిపారు. చివరకు ఇద్దరి పేర్లను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఓసీ కోటాలో చలమల్ల కృష్ణారెడ్డి (Chalamala Krishna Reddy) పేరు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బీసీ కోటాలో పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud) పేరుని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 


ఉద్యమ నేతకు ఛాన్స్ దక్కుతుందా !
జర్నలిస్ట్‌ గా మునుగోడు ప్రజలకు పరిచయమైన పల్లెరవి ఉద్యమ సమయంలో తన వంతు బాధ్యతని భుజానెత్తుకోవ‌డం, బీసీ నేతగా ఎప్పుడూ ఆ వర్గ ప్రజలతో పాటు సొంత నియోజకవర్గం మునుగోడు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటార‌నే పేరు రావ‌డం ప్లస్ పాయింట్ అయ్యింది. అంతే కాదు ఇటు బీజేపీ అభ్యర్థి ఓసీ సామాజిక వ‌ర్గం, కాగా అటు టీఆర్ఎస్ కూడా ఓసీ సామాజిక‌వ‌ర్గం అభ్యర్థినే బ‌రిలో దింపే అవ‌కాశం ఉండ‌టం, క్యాస్ట్ ఈక్వేష‌న్ లో బీసీలు అధికంగా ఉన్న మునుగోడులో బీసీ అభ్యర్థి అయితే బాగుంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ భావించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ పల్లె రవికే మునుగోడు బైపోల్‌లో ఛాన్స్‌ ఇవ్వనుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరు కల్లా కాంగ్రెస్‌ మునుగోడు అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశాలున్నాయని సీనియ‌ర్ నేత ఒక‌రు ‘ఏబీపీ దేశం’కు తెలిపారు.