Ktr Setires BJP :   తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. ఇటీవల అమిత్ షా పర్యటనలో ఆయన చెప్పులు విడిచినప్పుడు, వేసుకునేటప్పుడు  బండి సంజయ్ సహకరించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాత్ కాళ్ల దగ్గర పెట్టారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అయితే తనకు అమిత్ షా తండ్రి లాంటి వారని..అలా చెప్పులు అందించడం భారతీయ అని బండి సంజయ్ వాదించారు. ఈ వివాదం ఇలా కొనసాగుతోంది. తాజాగా బీజేపీ అధ్యక్షుడు నడ్డా.. తెలంగాణ పర్యటనకు వచ్చారు.ఈ సందర్భంగా కేటీఆర్ మరోసారి సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ రోజు నడ్డా చెప్పులను మోసేవారెవరో చెప్పలరా ? అంటూ ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన కార్టూన్‌ను ట్వీట్ చేశారు. అదే సమయంలో ఖచ్చితంగా పోటీ ఉంటుందని తెలుసని సెటైర్ వేశారు. 

కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ నేతలు ఈ ట్వీట్‌ను విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. బీజేపీ నేతల తీరు ఇలాగే ఉంటుందని అంటున్నారు. 

అయితే బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ కు.. కేటీఆర్ కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ జార్ఖండ్ పర్యటన సమయంలో శిబూసోరెన్ కాళ్లకు నమస్కారం చేసిన ఫోటోను పెట్టి విమర్శలు చేస్తున్నారు. అలాగే పలు చోట్ల కాళ్లకు నమస్కారాలు చేస్తున్న  ఫోటోలను పెట్టి కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తున్నారు. 

రాజకీయ నేతలు కనిపిస్తే కాళ్లకు నమస్కారం కామన్‌గా చేస్తూ ఉంటారు. అయితే చెప్పులు మోయడం మాత్రం చాలా ఆరుదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదీ కూడా బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకునే బండి సంజయ్ ఇలా చెప్పులు మోస్తే.. రేపు గెలిచిన తర్వాత తెలంగాణ ప్రయోజనాల కోసం కనీసం నోరెత్తగలరా అని ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు విధానపరమన అంశాల  విషయంలోనే కాకుండా.. వ్యక్తిగత అంశాల్లోనూ  విమర్శలు చేసుకునే దిశగా వెళ్తున్నాయి. ఒకరినొకరు సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు.