Smita Sabharwal : తన ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబడిన ఘటనపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "అర్ధరాత్రి చాలా బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించాడు. ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తితో చాకచక్యంగా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా, మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను మనమే స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర పరిస్థితిలో డయల్ 100కు ఫోన్ చేయాలి’’ అని స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్
మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి పూట స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. తాను డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పిన ఆనంద్ కుమార్.... తన విధుల విషయంలో ఇబ్బందులున్నాయని స్మితా సభర్వాల్ కు చెప్పాడు. ఈ విషయమై మాట్లాడేందుకు వచ్చినట్టుగా అతను చెప్పిన సమాధానంతో ఆమె అతనిపై మండిపడ్డారు. అర్ధరాత్రి ఎందుకు వచ్చారని ప్రశ్నించి, తన నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిచారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆనంద్ కుమార్ రెడ్డిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆనంద్ కుమార్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆనంద్ కుమార్ తో పాటు అతడితో వచ్చిన మరో వ్యక్తిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, కోర్టులో హాజరు పరచారు. న్యాయమూర్తి వారిద్దరికీ 15 రోజుల రిమాండ్ విధించారు.
అసలేం జరిగింది?
తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్... హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆమె చేసిన ట్వీట్లకు ఓ డిప్యూటీ తహసీల్దార్ ఒకరి రెండు సార్లు రీట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన హోటల్ యజమానిని అతని వెంటతీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్ ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు కొట్టాడు. డోర్ తెలిచిన మహిళా ఐఏఎస్ కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో తీవ్రంగా భయపడిపోయారు. తేరుకున్న ఆమె, నువ్వెవరు, ఎందుకొచ్చావని అని గట్టిగా ప్రశ్నించింది. అందుకు అతను గతంలో నేను మీకు ట్వీట్ చేశానని.. తన ఉద్యోగం గురించి మాట్లేందుకు వచ్చానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గుర్తైన ఆమె బయటకి వెళ్లాలని చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.