Bathukamma 2022 : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అక్టోబర్‌ 3న ట్యాంక్‌ బండ్‌ వద్ద నిర్వహించే ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై బీఆర్‌కే భవన్‌లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 


ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలు 


రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.  బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలన్నారు. ఎల్బీ స్టేడియం, హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 


పండుగ కానుక


తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ సమయం దగ్గరికి వచ్చింది. తెలంగాణ మహిళలకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ కి సిద్ధం అవుతోంది. ఈసారి 240 ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. 30 రంగుల్లో 800 కలర్ కాంబినేషన్లలో బ‌తుక‌మ్మ చీరలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కోట్ల మీటర్లు అవసరమని అంచనా వేయగా, పోయిన సంవత్సరం ఆలస్యంగా ఉత్పత్తి చేసిన చీరలను 1.23 కోట్ల మీటర్లు అప్పుడే స్వీకరించారు. ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు 4.70 కోట్లు, గర్షకుర్తి, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కు కలిపి కోటి మీటర్లు కేటాయించారు. టెస్కో మంగళవారం నాటికి 3. 25 కోట్ల మీటర్లు సేకరించింది. ఇంకా రెండు 2.45 కోట్ల మీటర్లు రావాల్సి ఉంది. చేనేత, జౌళిశాఖ ఉత్పత్తులు ఈ నెల 20 లోపు పూర్తిచేసి అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అవసరమైన చీరలో సింహభాగం జిల్లాలోని మరమగ్గాలపై ఉత్పత్తి చేయనున్నారు. దీనికోసం డాబీ, జకార్డ్ అమర్చిన పదివేల మరమగ్గాలను ఎంపిక చేశారు. టెక్స్ టైల్ పార్కులో ఐదు రకాల డిజైన్లతో 30 లక్షల మీటర్ల జాకెట్ వస్త్రాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. దీనిలో 30 లక్షల మీటర్లు మాత్రమే పూర్తయింది. జాప్యం కారణంగా మిగతావి సిరిసిల్లలోనే ఉత్పత్తి చేస్తున్నారు. చీర అంచుల్లో రంగు రంగుల నూలుతో తయారు చేసిన ఆకర్షణీయమైన డిజైన్లు వస్తున్నాయి.


Also Read : KTR Tabs : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్ విద్యార్థులకు స్మైల్ గిఫ్ట్ - కేటీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదిగో !