Umesh Yadav: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపిక కావడం పట్ల టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. దేశం కోసం ఆడటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందని.. ఆ అవకాశం వచ్చినప్పుడు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. 


షమీ స్థానంలో ఉమేష్


కరోనా బారిన పడిన మహ్మద్ షమీ స్థానంలో ఆసీస్‌తో స్వదేశంలో జరగనున్న సిరీస్‌కు ఉమేశ్ యాదవ్ ఎంపికయ్యాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఉమేష్‌కు పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదు. తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం 7 టీ20లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే మొత్తం 163 మ్యాచ్‌లలో 166 టీ20 వికెట్లతో ఉమేష్ యాదవ్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కల్‌కతాకు ఆడిన ఉమేష్ 12 మ్యాచ్‌లలో 7.06 ఎకానమీతో 16 వికెట్లు సాధించాడు. కొత్త బంతితో ఉమేష్ యాదవ్ ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడు.


కౌంటీ క్రికెట్ తో ప్రాక్టీస్
 
34 ఏళ్ల ఉమేష్ యాదవ్ 2019 ఫిబ్రవరిలో చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి పొట్టి ఫార్మాట్ లో అవకాశాలు రాలేదు. ఇటీవల ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో మిడిల్ సెక్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. రాయల్ లండన్ తో వన్డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు. అనంతరం భారత్ కు తిరిగివచ్చిన ఉమేష్ 7 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 16 వికెట్లు తీశాడు. 


టీ20 లకు సిద్ధంగా ఉన్నా


ఇప్పుడు ఆసీస్ తో సిరీస్ కు ఎంపికైన సందర్భంగా ఉమేష్ ఓ వార్తా ఛానల్ తో మాట్లాడాడు. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందని తెలిపాడు. అవకాశం వచ్చినప్పుడు తనవంతు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తాను టీ20 ఆడేందుకు సరిపడా ఫిట్ నెస్ తో ఉన్నట్లు స్పష్టం చేశాడు. మిడిల్ సెక్స్ తో క్రికెట్ ఆడడం వల్ల తాను ఫాంలోనే ఉన్నట్లు తెలిపాడు. కౌంటీ క్రికెట్ ను ఆస్వాదించానని.. ఇంగ్లండ్ లో వాతావరణం బాగుందని వివరించాడు. 


ఐపీఎల్ 2020 లో ఆర్సీబీ  తరఫున ఆడిన ఉమేష్ కు తర్వాత వైట్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. తర్వాత ఐపీఎల్ 2022 లో కేకేఆర్ తరఫున అవకాశం వచ్చినప్పుడు బాగా బౌలింగ్ చేశాడు. విరామ సమయంలో తాను బాగా ప్రాక్టీస్ చేశానని, నెట్స్ లో శ్రమించానని చెప్పాడు.