KTR Tabs : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారందరికీ ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయబోతున్నారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే ట్యాబ్లెట్స్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ పలుమార్లు ఇంటర్ విద్యార్థులకు కెరీర్‌కు అవసరమైన సాయం చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా బైజూస్ సంస్థతో ఆయన మాట్లాడారు. ఆ చర్చలు ఫలించడంతో గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రాం కింద ఉచితంగా ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు ప్రముఖ ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ ముందుకు వచ్చింది.
ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయయి. ఈ ట్యాబ్స్‌లో ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్‌ను పొందుపరిచారు. ఇంటర్ మెటీరియల్‌తో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. తన హామీని నెరవేర్చుకునే సమయం ఆసన్నం కావడంతో సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌ను తానే స్వయంగా మరో వారంలో పంపిణీ చేస్తానని ఆ ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో కేటీఆర్ సామాజిక సేవను ప్రోత్సహిస్తున్నారు. గతంలో తన జన్మదినం సందర్భంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ప్రకటించిన కేటీఆర్..ఇతర ప్రజా ప్రతినిధుల్ని కూడా అలా విరాళం ఇవ్వాలని ప్రోత్సహించారు. కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి 100 అంబులెన్స్‌లను విరాళంగా అందజేశారు. ఆ తర్వాత ఏడాది వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను విరాళంగా ఇస్చ్చారు. వంద మంది వికలాంగులకు తన జన్మదిన సందర్భంగా ఆ వాహనాలను పంపిణీ చేశఆరు. ఈ కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పలువురు నేతలు గిఫ్ట్ ఏ స్మైల్ కింద విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కింద సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్‌లు అందుతున్నాయి.
ఇండియాలో ఆన్ లైన్ ఎడ్యూటెక్ కంపెనీల్లో బైజూస్ నెంబర్ వన్‌గా ఉంది. కరోనా సమయంలో దేశం అందరూ ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ కంపెనీ వృద్ధి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా బైజూస్ నుంచి ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రూ. ఐదు వందల కోట్ల వరకూ ఖర్చు పెట్టాలని నిర్ణయించుంది. తెలంగాణ సర్కార్ అలాంటి ఒప్పందం ఏదీ చేసుకోలేదు కానీ... రాజన్న సిరిసిల్ల ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఉచితంగా అందిస్తోంది.