Assembly Seats : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీట్ల పెంపుపై పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని విభజన చట్టంలో ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. విభజన చట్టం నిబంధనలు అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ లో ఏపీ, తెలంగాణ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఈ రిట్ పిటిషన్‌ను జమ్ముకశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్‌కు జతచేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
కేంద్రం ఏం చెబుతోంది!
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇప్పుడల్లా ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టంగా తెలిపింది. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారని ఇటీవల లోక్‌సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో నియోజకవర్గాలను 175 నుంచి 225 కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచేందుకు పరిశీలించాలని ఉంది. కానీ కచ్చితంగా పెంచాలని లేదు.
2026లోనే పెంపు?
నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండా సీలింగ్ పెట్టారు. అందుకే అసెంబ్లీ సీట్లను పెంచాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. శాసనసభ స్థానాల పెంచాలంటే ఆర్టికల్ 170 (3)ను సవరించాలని, అందుకే అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ 2026వరకు సాధ్యం కాదని కేంద్రం గతంలోనే పార్లమెంట్ లో చెప్పింది. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన అని తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్నా తెలుగుదేశం, టీఆర్ఎస్.. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తీవ్రంగా పట్టుబట్టాయి. ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ నేతలు ఇందు కోసం తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. కానీ రాజ్యాంగ సవరణ చిక్కులతో ఎక్కడిదక్కడ ఉండిపోయింది. అయితే తాజాగా అసెంబ్లీ సీట్ల పెంపుపై వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఈసీ, తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
Also Read : Jagan No Reviews : నియోజకవర్గ సమీక్షలు జగన్ ఎందుకు ఆపేశారు ? పార్టీలో సమస్యలు ఎక్కువయ్యాయా ?