Mohanbabu :  మంచు మోహన్ బాబు, ఆయన కుమారులకు  హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతిలో నమోదైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసుపై విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపి వేయాలని  హైకోర్టు ఆదేశించింది. గతంలో ఈ కేసులో సమన్లు జారీ కావడంతో మోహన్ బాబు , ఆయన కుమారులు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను నిలిపివేయాలని హైకోర్టును మోహన్ బాబు , ఆయన కుమారులు ఆశ్రయించారు. విచారమ జరిపిన హైకోర్టు ఎనిమిది వారాల పాటు విచారణను నిలిపివేస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 


ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రోడ్డుపై మోహన్ బాబు ధర్నా


ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ  2019 ఎన్నికలకు ముందు తన కాలేజీ విద్యార్ధులతో కలిసి మోహన్ బాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆందోళన చేసినందుకు గాను మోహన్ బాబుతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణకు హాజరుకాకపోవడంతో సమన్లు జారీ అయ్యాయి. చివరికి గత జూన్‌లో కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్ర చేస్తూ కోర్టుకు రావడం  వివాదానికి కారణం అయింది. ఆ సమయంలో కోర్టు బయట మీడియాతో తాను బీజేపీ మనిషినని అవసరం లేకపోయినా చెప్పుకున్నారు. 


తిరుపతి కోర్టులో కేసు విచారణ జరుగుతూండటంతో నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు


జూన్‌ తర్వాత మళ్లీ కేసు విచారణకు మోహన్ బాబు హాజరు కాలేదు. అయితే  మళ్లీ వాయిదాలు ఉండటంతో కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు  ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ధర్నా చే్యడంతోనే  సమస్య వచ్చింది. ఆ ధర్నా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీకి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే ఆయన ధర్నా చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లో ఆరోపించారు. 


గతంలోనూ చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు జైలు శిక్ష 


అయితే మోహన్ బాబుపై కేసులు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. 2019 ఏప్రిల్‌లో చెక్ బౌన్స్ కేసులో  మోహన్ బాబుకు  ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు  ఎర్రమంజిల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ జైలు శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానాను కూడా విధించింది...2010లో చెక్ బౌన్స్ కేసును దర్శకుడు వైవీఎస్ చౌదరి వేశాడు. ఈ కేసులో ఏ 1 లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నాడు.2010 లో రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చెక్‌బౌన్స్‌ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. సలీం సినిమా చిత్ర నిర్మాణ సమయంలో ఈ వివాదం చోటు చేసుకొంది. ఈ కేసులో ఏ1 గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ కు రూ. 10వేల జరిమానాను విధించింది. అయితే తర్వాత ఈ కేసులోనూ మోహన్ బాబు బెయిల్ తెచ్చుకున్నారు.