President Droupadi Murmu Meets King Charles: 


ఛార్లెస్-IIIని కలిసిన రాష్ట్రపతి


భారత్ తరపున క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లండన్ వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అక్కడ బంకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన ఆమె...బ్రిటన్ రాజు ఛార్లెస్-IIIని కలిశారు. క్వీన్ ఎలిజబెత్ కండోలెన్స్ బుక్‌లోనూ రాష్ట్రపతి సంతకం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.  "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ కండోలెన్స్ బుక్‌లో సంతకం చేశారు" అని ట్వీట్ చేసింది. వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో క్వీన్ ఎలిజబెత్‌ భౌతికకాయానికి ఆమె నివాళులు అర్పించారు. రెండ్రోజుల క్రితమే లండన్‌కు వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమెతో పాటు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా కూడా వచ్చారు. లండన్‌లోని గాట్విక్ 
ఎయిర్‌పోర్ట్‌లో దిగి అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లారు. యూకేలోని హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఆమెకు గౌరవ స్వాగతం పలికారు. వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేలో జరిగే అంత్యక్రియలకు రాష్ట్రపతి హాజరవుతారు. యూకే స్టేట్ ఫర్ ఫారిన్, కామన్ వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్‌ సెక్రటరీ జేమ్స్ క్లవర్లీ ఏర్పాటు చేసే సమావేశానికి వెళ్తారు






 
ప్రముఖుల హాజరు

పలు దేశాల నేతలు, సంపన్నులు అందరూ లండన్‌కు చేరుకుంటున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరు కానున్నారు. వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో రాణి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మరో వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్త 2 వేల మంది పాల్గొంటారు. వీరిలో 500 మంది పలు దేశాలకు చెందిన నేతలే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ఎంపెరర్ నరుహిటో, చైనా వైస్‌ ప్రెసిడెంట్ వాంగ్ కిషాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస హాజరవుతారు. భారత్ తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి అర్పించేందుకు వెళ్లారు. లండన్‌లో మునుపెన్నడూ చూడని స్థాయిలో భారీ భద్రతల నడుమ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. "ప్రపంచంలోని కీలక నేతలందరూ కలిసి ఒకే వేదికపై వచ్చి దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. అందుకే అప్రమత్తంగా ఉంటున్నాం" అని లండన్ భద్రతాధికారులు చెబుతున్నారు. "కొందరు ఈ సందర్భాన్ని అదనుగా చూసుకుని విధ్వంసం సృష్టించాలని చూస్తారు. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశాం. పోలీసులు అంతటా నిఘా పెట్టారు. అంత్యక్రియలు ఎలాంటి ఇబ్బందు లేకుండా పూర్తయ్యేలా చూస్తున్నాం" అని మేయర్ సాదిక్ ఖాన్ వెల్లడించారు. 


లైవ్‌లో చూడొచ్చు..


వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో ఆమె శవపేటికను తరలిస్తారు. రాయల్ స్టాండర్ట్ ఫ్లాగ్‌ను ఆ శవపేటికకు చుడతారు. దానిపై రాణి ధరించిన కిరీటం ఉంచుతారు. అక్కడ ఓ పెద్ద గంట ఉంటుంది. 96 ఏళ్ల వయసులో రాణి చనిపోయినందున, నిముషానికోసారి ఆ గంటను మోగిస్తారు. 
అంటే... అలా 96 సార్లు మోగిస్తారు. అక్కడి నుంచి రాణి శవపేటికను విండ్సర్ క్యాసిల్‌కు తరలిస్తారు. సెయింట్ జార్జ్ చాపెల్‌లోని ఆమె తల్లిదండ్రులు, భర్త, సోదరి ప్రిన్స్ మార్గరెట్ సమాధుల పక్కనే ఆమెనూ పూడ్చి పెట్టనున్నారు. ఇది పూర్తి కాగానే సంప్రదాయ సంగీతాన్ని
వినిపిస్తారు. చివర్లో ట్రంపెట్‌తో ఆమెకు చివరిసారి నివాళి అర్పిస్తారు. దేశమంతా ఓ రెండు నిముషాల పాట మౌనం పాటిస్తుంది. వెస్ట్‌మిన్‌స్టర్ డీన్‌ డేవిడ్ హొయ్‌లే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని ప్రపంచమంతా లైవ్‌లో వీక్షించేందుకు అవకాశముంది. 
BBC One, BBC Newsలో లైవ్ ఇస్తారు.