Dasoju Sravan Kumar : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందడం బాధాకరమని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఈ మరణానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యమే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 


''ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ధనిక రాష్ట్రం అని చెబుతున్నారు. ధనిక రాష్ట్రంలోని ఓ హాస్పిటల్ లో ఎలుకలు కొరికి ఓ వ్యక్తి చనిపోయాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా వుంటుందా?  గతంలో అనేక సందర్భాల్లో ఎంజీఎం హాస్పిటల్ పై ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ మౌలిక వసతులు, వైద్య పరికారాలు లేవని  కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. చివరికి ఒక మనిషి చావుకి కారణమయ్యారు. ఈ చావుకి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన జరిగిన మరణం. ఈ ఘటనలో కేసీఆర్ పై మర్డర్ కేసు పెట్టాలి'' అని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.  


ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని మూసివేయండి 


హైదరాబద్ లో వెలుగు చూస్తున్న డ్రగ్స్ మాఫియాపై స్పందించిన దాసోజు శ్రవణ్... ''గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ డ్రగ్ హబ్ గా మారింది. గ్రేటర్ ని మరో బ్యాంకాక్ గా మార్చింది టీఆర్ఎస్. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికే హైదరాబాద్ గ్లోబల్ సిటీ. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గ్లోబల్ సిటీని కాస్త గ్రేట్ డ్రగ్ సిటీగా మార్చింది. స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించండని టీఆర్ఎస్ కి అధికారం ఇస్తే వీధికో వైన్ షాప్ గల్లీకో పబ్బు, రోడ్డుకో క్లబ్బు అన్నట్టు యువతని మత్తులో ముంచే కార్యక్రమం చేపట్టింది టీఆర్ఎస్'' అని విమర్శించారు. ఇంటర్ నేషనల్ యూనివర్శిటీ తీసుకురావాలని ప్రజలు ఆశపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లే బాయ్ క్లబ్ ని తీసుకొచ్చి డ్రగ్స్ కల్చర్ ని ప్రోత్సహించిందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో పబ్బులు, క్లబ్బులు నడుపుతున్నారన్నారు.  ప్రజా ప్రతినిధులే పబ్బులు క్లబ్బులు నడపడం అత్యంత హేయమని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే జుబ్లీహిల్స్, బంజారాహిల్స్ , మాదాపూర్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లోని పబ్బులు, పేకాట అడ్డాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. 


Also Read : Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్టు, వెలుగులోకి సంచలన విషయాలు!