Kamareddy News : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చిరుతల సంచారం స్థానికులను కలవరపెడుతోంది. రెండు చిరుతపులులు సంచరిస్తున్న దృశ్యాలు అటవీ శాఖ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట, మద్దికుంట గ్రామాల మధ్య గల ఓ నర్సరీ ప్రాంతంలో నీటి తొట్టే వద్ద రెండు చిరుతపులులు నీళ్లు తాగుతున్న దృశ్యాలు అటవీశాఖ  సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిన్న రాత్రి కామారెడ్డి నుంచి రెడ్డి పేట వైపు కారులో ప్రయాణిస్తున్న వారికి చిరుతపులి ఎదురైంది. దీన్ని గమనించిన వాహనదారులు తమ సెల్ ఫోన్ లో చిరుతపులి దృశ్యాలను రికార్డు చేశారు. ఈ ప్రాంతంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మద్దికుంట రెడ్డి పేట గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రెండు చిరుతపులులు సంచరించడంతో ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట వ్యవసాయ పనులకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. రెండు చిరుత పులుల సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. 


Also Read : Jagityala News : జగిత్యాల జిల్లాలో విషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి


నిర్మల్ , ఆదిలాబాద్ జిల్లాల్లోనూ 


నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ చిరుతల సంచారం కలకలం రేపుతోంది. అడవుల్లో ఉండాల్సిన చిరుతలు తరచూ జనావాసాలలోకి వచ్చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్‌ మండలం బీరవెల్లి గ్రామంలోనూ చిరుతల సంచారాన్ని స్థానికులు గుర్తించారు. గురువారం రాత్రి అటవీ ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లో చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. గ్రామ శివార్లలో చిరుత సంచరించడంతో స్థానికులు, రైతులు హడలిపోయారు. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రైతులకు చిరుత అరుపులు వినిబడటంతో పనులకు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి వేళ టార్చిలైట్లు వేసుకొని తోటలో చిరుతలు ఎలా వస్తున్నాయో గమనించేందుకు రైతులు ప్రయత్నించారు. రాత్రి 10 గంటల సమయంలో రైతులు టార్చ్‌లైట్లు వేసుకొని చూసిన సమయంలో పంట పొలాల్లో చిరుత కనిపించింది. మొత్తం గ్రామంలో ఉన్న 30-40 మంది రైతులు టార్చ్‌లైట్లు తీసుకుని పొలం దగ్గరకు వచ్చి పులులను తరిమివేసేందుకు గట్టిగా అరుపులు, శబ్ధాలు చేశారు. అప్పటికీ చిరుతలు కదలకపోవడంతో పొలంలో మంట పెట్టారు. దీంతో చిరుతల సమీపంలోని అడవుల్లోకి వెళ్లిపోయాయని రైతులు తెలిపారు.


Also Read : Karimnagar News : కరీంనగర్ వైద్యుల వినూత్న ట్రీట్మెంట్, డాన్స్ థెరపీతో యువకుడిలో చలనం!