Upcoming Cars April 2022: భారత ఆటోమొబైల్ రంగానికి గత రెండేళ్లు ఎంతో కష్టంగా గడిచాయి. బీఎస్6కు మారడంలో సవాళ్లు, కరోనావైరస్ పాండమిక్ కారణంగా సేల్స్ తగ్గడం వంటి ఎదురుదెబ్బలు ఎన్నో తగిలిాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పాటు... వినియోగదారులు కొత్త వాహనాలు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా కొత్త కార్లు లాంచ్ చేస్తున్నాయి. 2022 మొదటి త్రైమాసికంలో ఎన్నో కార్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్‌లో కూడా కొన్ని కొత్త కార్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి. ఆ కార్లు ఇవే...
1. మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki Ertiga Facelift)
మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే సెవెన్ సీటర్ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా కూడా ఒకటి. అయితే కియా కారెన్స్ రాకతో ఈ రంగంలో పోటీ చాలా ఎక్కువైంది. దీనికోసం ఈ భారతీయ కార్ల బ్రాండ్ మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిప్ట్‌ను లాంచ్ చేయనుంది. ఈ కారు ఈ నెలలోనే మనదేశంలో లాంచ్ కానుంది. తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది.
2. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki XL6 Facelift)
2019లోనే మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లాంచ్ అయింది. అయితే ఆ తర్వాత ఈ కారు మనదేశంలో మొదటి ఫేస్‌లిఫ్ట్‌ను అందుకోనుంది. ఈ ఆరు సీట్ల ఎంపీవీ కారు కొత్త డిజైన్‌తో రానుందని తెలుస్తోంది. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు ఇందులో ఉండనున్నట్లు సమాచారం. దీంతోపాటు తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రీడిజైన్ చేసిన ఎయిర్ కాన్ కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
3. స్కోడా కుషాక్ మాంటే కార్లో (Skoda Kushaq Monte Carlo)
స్కోడా తన కుషాక్ మాంటే కార్లో ఎడిషన్‌ను మనదేశంలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ నెలాఖరులోపు ఈ కారు మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మాంటే కార్లో ఎడిషన్‌లో కొత్త ఎక్స్‌టీరియర్ కలర్, నల్లటి గార్నిష్, డార్క్ అలోయ్ వీల్స్ ఇందులో ఉండనున్నాయి. దీంతోపాటు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో అందించినట్లు సమాచారం.
4. హోండా సిటీ ఈ:హెచ్ఈవీ హైబ్రిడ్ కారు (Honda City e:HEV Hybrid Car)
ఈ కారు మనదేశంలో ఏప్రిల్ 14వ తేదీన లాంచ్ కానుంది. ప్రస్తుతానికి ఇది మలేషియా, థాయ్‌ల్యాండ్‌ల్లో అందుబాటులో ఉంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. దీని బీహెచ్‌పీ 97గానూ, పీక్ టార్క్ 127 ఎన్ఎంగానూ ఉండనుందని తెలుస్తోంది. సాధారణ హోండా సిటీ కంటే ఇది తక్కువే. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ఈ కారు లీటరుకు 27.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
5. టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు (New Tata Electric Car)
ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో లీడర్ అయిన టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారును దేశంలో లాంచ్ చేయనుంది. ఈ కారు ఏప్రిల్ 6వ తేదీన లాంచ్ కానుంది. కంపెనీ ఈ కారు గురించి అధికారిక సమాచారం ఏదీ అందించకపోయినా... దీనికి సంబంధించిన వివరాలు నెట్టింట లీకయ్యాయి. ఈ కారు 2022 నెక్సాన్ ఈవీ లేదా టాటా అల్ట్రోజ్ ఈవీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కసారి చార్జ్ పెడితే ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?