Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు సప్లై చేశారు? ఎవరెవరు తీసుకున్నారన్న కోణంలో విచారణ చేస్తు్న్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్‌రావు, ఈవెంట్ మేనేజర్ అనిల్, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, వీఐపీ మూమెంట్ చూసే కునాల్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
పబ్ లో డ్రగ్స్ స్వాధీనం
ఈ కేసులో ప్రముఖులు చాలా మంది ఉండడంతో అసలు డ్రగ్స్ పబ్‌లోకి ఎలా వచ్చాయనే కోణం పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పబ్ లో పోలీసులు ఇప్పటి వరకూ 5 గ్రాముల కొకైన్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చాక్లెట్ రోల్స్‌లో ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్ పెట్టుకుని డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పబ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఎఫ్ఎస్‌ఎల్ రిపోర్టు కోసం పంపించారు. ఆ నివేదిక అందిన తర్వాత పబ్‌లో వినియోగించిన మాదక ద్రవ్యాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు అంటున్నారు.
బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ శివచంద్ర సస్పెండ్
ఈ పబ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో డ్రగ్స్ పట్టుబడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ శివచంద్రను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ శారు. ఆయన స్థానంలో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావును నియమించారు. బంజారాహిల్స్ పీఎస్ కు నూతన ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వర్ రావు నియమించారు సీపీ ఆనంద్. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వరరావు పనిచేశారు. టాస్క్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు టీమ్ పబ్ లో శనివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ చేసింది. పబ్ లో డ్రగ్స్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు. గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డు నాగేశ్వరరావు సొంతం. బంజారాహిల్స్ డ్రగ్స్ కేసును నూతన ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు విచారిస్తు్న్నారు. ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఇన్ స్పెక్టర్ శివ చంద్ర సీపీ సస్పెండ్ చేశారు. గతంలో శి చంద్రపై సెటిల్మెంట్లు ఆరోపణలు ఉన్నాయి. పబ్ లపై నిఘా పెట్టకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.