Goat Marriage : ఏవండీ ఆవిడ వచ్చింది సినిమాలో కమెడియన్ బాబు మోహన్ కు గాడిదతో పెళ్లి చేస్తారు. శోభన గండం పోవాలంటే గాడిద మెడలో తాళి కట్టాలని చెప్పిన మాటలు నమ్మి పెళ్లి చేసుకుంటారు. అప్పటి నుంచి ఆ గాడిద బాబు మోహన్ చుట్టూ తిరుగుతుంది. ఆ సీన్లు సినిమాలో హాస్యం పండించాయి. అలాగే మా అబ్బాయికి పెళ్లి అవడం లేదంటూ కొందరు పెద్దోళ్లను అడిగితే ఏదో చెట్టు పేరు చెప్పి తాళ్లి కట్టమంటారు. వీటితో పాటు వింత ఆచారాలు కూడా ఉంటాయనుకోండి. అయితే కృష్ణా జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. జాతకంలో దోషం ఉందని ఓ యువకుడికి మేకతో పెళ్లి చేశారు.
యువకుడి జాతకంలో రెండు పెళ్లిళ్లు
ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న సమయంలో కొన్ని మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతకం ప్రకారం యువకుడికి రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందని దోష నివారణకు మేకతో పెళ్లి చేయాలని చెప్పిన మాటలు నమ్మి పెళ్లి జరిపించారు. కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. నూజివీడుకు చెందిన ఓ యువకుడికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇంట్లో పెద్దలు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. యువకుడి జాతకాన్ని ఓ జోతిష్యుడికి చూపించారు. అయితే ఆ జోతిష్యుడు యువకుడి జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఉందని చెప్పాడు. ఆ దోష నివారణకు మేకతో పెళ్లి చేయాలని సూచించాడు. దీంతో కుటుంబ సభ్యులు యువకుడికి మేకతో వివాహానికి సిద్ధం చేశారు.
ఉగాది రోజున ఘనంగా పెళ్లి
ఉగాది రోజున నూజివీడులోని నవగ్రహ ఆలయంలో యువకుడికి మేకతో పెళ్లి జరిపించారు. ఉగాది రోజున పురోహితులు యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో తాళి కట్టించారు. మేకతో మొదటి పెళ్లి అయిపోయింది కాబట్టి మరో వివాహం చేసుకున్నా ఇబ్బంది ఉండదని ఆ యువకుడు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి వైరల్ అయింది. దీంతో మేకతో పెళ్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ ఇలాంటి మూఢ నమ్మకాలేంటి అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని అంటున్నారు. జ్యోతిష్యులు చెబుతున్న వింత ఆచారాలను గుడ్డిగా నమ్మతున్నారని మరికొందకు ఉంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే మేకతో పెళ్లి మాత్రం వింతగా ఉందని నోరెళ్లబెడుతున్నారు.