AUS vs ENG Australia beat England by 71 runs to win ICC Womens WC: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మరోసారి అద్బుతం చేసింది. ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హేలీ కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేయడంతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ ముందు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 భారీ లక్ష్యాన్ని నిలపడంలో కీలకపాత్ర పోషించింది. అనంతరం ఛేజింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ కావడంతో దారుణ ఓటమిని చవిచూసింది.
టాస్ ఓడి ఆసీస్ బ్యాటింగ్..
తొలుత టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆసీస్ ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 29.1 ఓవర్లలో 160 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఓపెనర్ రాచెల్ హేన్స్‌ను (93 బంతుల్లో 68)ను ఇంగ్లాండ్ బౌలర్ ఎస్కెల్ స్టోన్ ఔట్ చేసింది. ఆపై రెండో వికెట్‌కు సైతం అలిస్సా హేలీ 156 పరుగుల భారీ భాగస్వామ్యం అనంతరం రెండో వికెట్‌గా నిష్క్రమించింది. అలీస్సా హేలీ (138 బంతుల్లో 170; 26x4) భారీ శతకం సాధించింది. వన్ డౌన్ ప్లేయర్ బెత్ మూనీ హాఫ్ సెంచరీ(62)తో రాణించడంతో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 356 రన్స్ చేసింది.
నాట్ సీవర్ ఒంటరి పోరాటం..
ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ డాని వాట్(4) క్లీన్ బౌల్డ్ అయింది. మరో ఓపెనర్ సైతం 27 పరుగుకు స్కూట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఆపై ఇంగ్లాండ్ వరుస విరామాలలో వికెట్లను కోల్పోతున్నా.. మరో ఎండ్ లో నాట్ సీవర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. 121 బంతుల్లో 15x4, 1x6 తో 148 పరుగులతో అజేయంగా నిలిచింది. మరో ఎండ్‌లో వికెట్లు పడటంతో స్కోరు 300 కూడా చేయలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు. టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన కెప్టెన్ హీధర్ నైట్ 26 రన్స్ చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. 43.4 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 285 పరుగులకు ఆలౌట్ కాగా, వన్డ్ వరల్డ్ కప్ 2022 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో స్కూట్ 2 వికెట్లు పడగొట్టగా.. అలాన కింగ్, జెస్ జొనాసెన్ చెరో 3 వికెట్లు తీశారు.
Also Read: IPL 2022, MI vs RR: జాస్ బట్లర్ అరుదైన రికార్డ్ - ఐపీఎల్ శతకంతో అరుదైన జాబితాలోకి ఇంగ్లాండ్ క్రికెటర్
Also Read: RR Vs MI: ముంబైపై రాయల్ విక్టరీ - అదరగొట్టిన హైదరాబాదీ తిలక్ - అడ్డుకున్న రాజస్తాన్ బౌలర్లు!