CM KCR : తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని తెలిపారు. “జాతీయ రైతు దినోత్సవాన్ని” (కిసాన్ దివస్ ) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులకు నేటి స్వరాష్ట్రంలోని రైతు సంక్షేమం వ్యవసాయం పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలను గుణాత్మక దిశగా అభివృద్ధి చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలుచేస్తుందన్నారు. దేశ వ్యవసాయరంగ నమూనా మార్పులో తెలంగాణ వ్యవసాయ రంగాభివృద్ధి బాటలు వేసిందని కేసీఆర్ తెలిపారు.
సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ
తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిని పండుగలా మార్చడంతో పాటు, దేశానికే అన్నపూర్ణగా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించడం వెనుక ఎంతో శ్రమ, మేథో మథనం దాగి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తూ కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా, లెక్కచేయకుండా పట్టుదలతో అడ్డంకులను అధిగమిస్తూ రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
స్పిన్ ఆఫ్ ఎకానమి
వ్యవసాయరంగంలో సాధించే ప్రగతి అన్ని రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయరంగంతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. వ్యవసాయరంగంలో అభివృద్ధిని సాధించడంతో వ్యవసాయ అనుబంధ రంగాలు పటిష్టమై గ్రామీణార్థిక వ్యవస్థ బలోపేతమౌతుందన్నారు. అది “స్పిన్ ఆఫ్ ఎకానమి” కి దారి తీసి సుస్థిరాభివృద్ధి’ జరుగుతుందని సీఎం అన్నారు. ప్రాథమికరంగమైన వ్యవసాయంలో చోటు చేసుకునే ప్రగతి ద్వారా, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. దీని ప్రభావం, ద్వితీయ, తృతీయరంగాలైన పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలకు, సేవారంగాలకు విస్తరిస్తుందన్నారు. ఇదే సూత్రాన్ని అనుసరించి అన్ని రంగాల్లో వృద్ధిరేటు ఊహించని రీతిలో నమోదవుతుందన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలకు దోహదం చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
రైతు సంక్షేమ విధానం
విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగంతో పాటు పలు వృత్తుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు, సామాజిక పెట్టుబడిగా పరిణామం చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్థిక విధానాన్ని తన కార్యాచరణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ఇటువంటి రైతు సంక్షేమ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాధిస్తున్న తెలంగాణ స్ఫూర్తితో దేశంలో కిసాన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ తో దేశ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలైన పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.