Bandi Sanjay : రైతులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చుతుందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టంపై బీఆర్ఎస్ నేతలకు కనీస అవగాహన లేకపోవడం సిగ్గు చేటు అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉపాధి హామీ అనుసంధానించడం సాధ్యం కాదనే సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించిన బీఆర్ఎస్ దొంగలు... లెక్కలడిగితే సెంటిమెంట్ తో రెచ్చగొట్టాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ, ఫ్రీ యూరియా సహా రైతులకు ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల రైతు ధర్నాలపై బండి సంజయ్ మండిపడ్డారు. 


బీఆర్ఎస్ ధర్నాలు హాస్యాస్పదం 
 
వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు జాతీయ ఉపాధి  హామీ చట్టంపై ఏమాత్రం అవగాహన లేదని అర్థమవుతోందన్నారు. కనీసం ఆ చట్టంలో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు జాతీయ ఉపాధి చట్టం పరిధిలోకి రానేరావన్నారు. నీటిపారుదల కార్యకలాపాలు, నీరు, భూమి అభివృద్ధి పనులు, చిన్న నీటిపారుదల పనులు మాత్రమే చట్టంలోని షెడ్యూల్ 4(3)లో భాగంగా ఉన్నాయన్నారు.2005లో ఈ మేరకు చట్టం చేశారన్నారు. 17 ఏళ్ల తరువాత ఆ చట్టంలో లేని అంశాలపై ధర్నాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుండటం బీఆర్ఎస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని బండి సంజయ్ మండిపడ్డారు.


అవినీతి కప్పిపుచ్చుకునేందుకే ధర్నాలు 
 
"వాస్తవానికి జాతీయ ఉపాధి హామీ పథకం వేతనాల్లో భాగంగా విడుదలైన రూ.161 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇందులో అవినీతి జరిగిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను వెంటనే వాపస్ చేయాలని కోరడంతో  అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ధర్నాలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రుణ మాఫీని ఎందుకు అమలు చేయడం లేదు? రైతులందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తానన్న హామీ ఏమైంది? కౌలు రైతులకు ‘‘రైతు బంధు’’ ఎందుకు అమలు చేయడం లేదు? ఏటా వేలాది మంది రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోతుంటే వారికి ఇంతవరకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా తెలంగాణ రైతాంగానికి నష్టం చేస్తోంది బీఆర్ఎస్ కాదా? రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని గగ్గోలు పెడుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ ఎందుకు ప్రకటించడం లేదు?" - బండి సంజయ్ 


కనీస మద్దతు ధర ఏటా పెంపు 


 రైతుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోయారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్ రైతులకు పంచడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు. చివరకు పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువు తీయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతున్నా బదనాం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ఎరువుల ధరలు అమాంతం పెరిగినప్పటికీ రైతులపై భారం పడకూడదనే ఉద్దేశంతో సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోందని గుర్తుచేశారు. కనీస మద్దతు ధరను ఏటా పెంచుతూ రెట్టింపు చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు బంధు మినహా అన్ని సబ్సిడీలు బంద్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని బండి సంజయ్ అన్నారు. కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం నమ్మే పరిస్థితిలో లేరనే వాస్తవాన్ని బీఆర్ఎస్ నేతలు గ్రహిస్తే మంచిదన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరిస్తే... ప్రధానమంత్రి హాజరైన ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా సీఎం కేసీఆర్ ముఖం చాటేశారన్నారు.