గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అధికారులకు డ్రగ్స్ కంట్రోల్ దిశానిర్దేశం చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందని సీఎం అన్నారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలన్నారు. 1000 మంది పోలీస్ సిబ్బందితో అత్యాధునిక టెక్నాలజీతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే విధంగా నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా పనిచేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీసు అధికారులకు అవార్డులు, రివార్డులు, ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు . ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు


తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలని సూచించారు. సామాజిక ఉద్యమంగా మలిచినప్పుడే డ్రగ్స్‌ ను నిర్మూలించం సాధ్యమవుతుందన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. నేరస్థులను కాపాడేందుకు  ప్రజాప్రతినిధులు ఎవరైనా సిఫార్సు చేస్తే అలాంటి వాటిని తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సీఎంవో అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 


Also Read: జాతీయ పార్టీల్లో బీజేపీ .. ప్రాంతీయ పార్టీల్లో ఎస్పీ, టీఆర్ఎస్ చాలా రిచ్ గురూ..! రాజకీయ పార్టీలకు ఎన్నెన్ని ఆస్తులున్నాయో తెలుసా..?