రాజకీయ పార్టీలు ఎలా నడుస్తాయి ? ఈ విషయంపై చాలా మందికి క్లారిటీ ఉండదు. భారీ ఖర్చులు పెట్టుకుని పార్టీల్ని నడపడం సామాన్యమైన విషయం కాదు. మరి వాటికి ఆ ఖర్చులకు నిధులు ఎలా వస్తాయి..? అత్యధికం విరాళాల ద్వారానే వస్తాయి. ఈ విరాళాల ద్వారా వచ్చిన వాటినే స్థిరాస్తులుగా మల్చుకుని కొంత స్థిరమైన ఆదాయాన్ని రాజకీయ పార్టీలు పొందుతూ ఉంటాయి. ఇలాంటి స్థిరాస్తులు అత్యధికంగా ఉన్న పార్టీల జాబితాను అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ప్రకటించింది. ఇందులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగు చూశాయి.
బీజేపీకి దాదాపుగా రూ. ఐదు వేల కోట్లకుపైగా స్థిరాస్తులు !
కేంద్రంతో పాటు మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ. ఆ పార్టీకి వచ్చే విరాళాలు కాకుండా స్థిరాస్తులు రూ. 4847 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. దేశంలో మరే జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీకి కనీసం రూ. వెయ్యి కోట్ల స్థిరాస్తులు లేవు. అన్ని రాజకీయపార్టీల ఆస్తులు కలిపి ఉన్నవి రూ. 6988.57 కోట్లు అయితే.. ఇందులో రూ. 4847 కోట్ల ఆస్తులు బీజేపీవే. ఇక దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థిరాస్తులు కేవలం రూ. 588 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. రూ.698 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ రిచ్.. ఆ తర్వాత టీఆర్ఎస్ !
ఇక ప్రాంతీయ పార్టీల్లో సమాజ్ వాదీ పార్టీకి అత్యధిక ఆస్తులు ఉన్నాయి. ఆ పార్టీకి దాదాపుగా రూ . 563 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లుగా ఏడీఆర్ లెక్క తేల్చింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్‌కు రూ. 301 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో అన్నాడీఎంకే, టీడీపీ ఉన్నాయి. మొత్తంగా 44 ప్రాంతీయ పార్టీలకు కలిపి రూ. 2028 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఈ మొత్తంలో 95 శాతం టాప్ టెన్ ప్రాంతీయ పార్టీలవే. స్థిరాస్తులు అంటే .. ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఇతర ఆస్తులు వస్తాయి.
బీజేపీకి సరి తూగే పార్టీ లేదు !
దేశంలో విరాళాల్లో అయినా ఆస్తుల్లో అయినా బీజేపికి సరితూగే పార్టీ లేదు. ఆ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ప్రతి ఏడాది వందల కోట్లలో విరాళాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ పార్టీ విరాళాల క్యాంపైన్ నిర్వహిస్తోంది. పార్టీ సానుభూతిపరులు విరాళాలు ఇవ్వాలని కోరుతోంది.