Hyderabad city Civil court sent notice to Pawan Kalyan | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని లాయర్ రామారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్య రామాలయంలో రాముడి పున ప్రతిష్టకు కల్తీ లడ్డూలు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. దాంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ కు కూడా సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంపై పవన్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియా నుంచి, మీడియా చానల్స్ నుంచి తొలగించేలా ఆదేశివ్వాలని పిటిషనర్ రామారావు కోర్టును కోరారు.


సంచలనం రేపిన తిరుమల లడ్డూ వివాదం


తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని కొన్ని రోజుల కిందట ఏపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చేసి అపచారం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే తీరుగా మాట్లాడారు. ప్రజలను కాదు దేవుడ్ని కూడా వైసీపీ అపవిత్రం చేసిందని, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ తిరుమలలో పర్యటించి దీక్ష విరమించడం తెలిసిందే. శ్రీవారిని దర్శించుకున్న తరువాత తిరుపతిలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ కూర్చునేది లేదని గత ప్రభుత్వ పెద్దలకు హెచ్చరికలు పంపారు. 
Also Read: Pawan Kalyan in Gurla: ఐదేళ్లు పంచాయతీ నిధుల దుర్వినియోగం వల్లే గర్ల ఘటనలు - బాధిత కుటుంబాలకు పవన్ వ్యక్తిగత సాయం ! 


ఇతర మతాల వాళ్లు ఎంతో భక్తి భావంతో ఉంటున్నారని మనలో ఐక్యత కొరవడిందని హిందువులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లా అని పేరు వినగానే ముస్లింలు ఆగిపోతారని, కానీ గోవిందా అని వినిపిస్తే మనం మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతాం. ఇకనైనా మనలో మార్పు రావాలన్నారు. తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ సైతం ప్రకటించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించాలన్నాలి. సనాతర ధర్మ పరిరక్షణ కోసం చట్టం తేవాలన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ చేసి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్నారు. ప్రతి ఏటా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు నిధులు కేటాయించాలని పవన్ సూచించారు. ఆలయాలు విద్యా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా ఉండాలన్నారు. అందుకోసం ఓ పటిష్టమైన చట్టాన్ని తీసుకువచ్చి సనాతన ధర్మాన్ని రక్షించాలని తిరుమలలో పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలుగా మారాయి. ముఖ్యంగా తమిళనాడు నుంచి పవన్ పై విమర్శల పర్వం మొదలైంది.