Pawan Kalyan inspected Diarrhea affected Gurla village in Vizianagaram district : విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను స్వయంగా గుర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడి ఓవర్ హెడ్ ట్యాంకులను నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. తర్వాత బాధిత కుటుంబాలను పరామరశించారు. మృతుల కుటుంబాలకు తాను వ్యక్తిగతంగా రూ. లక్ష సాయం అందచేస్తానని ప్రకటించారు.
గుర్ల మండలంలో అతిసారం ఎలా ప్రబలిందన్న అంశంపై విచారణ చేయించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. నివేదికరాగానే తగిన చర్యలతో పాటు బాధితుల్ని ప్రభుత్వ పరంగా కూడా ఆదుకుంటామన్నారు.
అధికారులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలతోనూ మాట్లాడారు. . దీంతో డిప్యూటీ సీఎం దృష్టికి గ్రామస్థులు మూడు ప్రధాన సమస్యలను తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రం చేయడంలేదని గ్రామస్థులు తెలిపారు. అలాగే ఒకే ఒక్క ట్యాంకు ఉండడం వల్ల తాగునీటి సమస్య వస్తోందన్నారు. ఐదేళ్ల పాటు పంచాయతీలకు వచ్చిన నిదుల్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని .. నిధులన్నింటినీ మళ్లించేయడంతో కనీసం పైపుల్ని బాగు చేయడానికి కూడా పంచాయతీల వద్ద నిధులు లేకుండా పోయాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఐదేళ్ల పాటు జరిగిన ఈ నిర్లక్ష్యాన్ని సరి చేస్తున్నామన్నారు. సమస్యలన్నీ పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
మేము గత ప్రభుత్వాలను విమర్శించడం లేదు కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదన్నారు. ఫిల్టర్ బెడ్స్ మార్పు చేసి ఉంటే నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేది. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టిన పనిచేయవచ్చు కదా, అధికారులు గతంలో నిధులు రాలేదు అంటున్నారు, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. త్వరలో మరో దాదాపు 650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నాయి. వాటిని కూడా నీటి సరఫరా మెరుగు పరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగించనున్నామని స్పష్టం చేశారు.