Telangana Group 1 Exam: గ్రూప్ 1 వాయిదా వేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్షల నిర్వాహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఓ వైపు పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న భయం సీరియస్‌గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు, అధికారుల్లో ఉంది. ఈ టైంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గ్రూప్ 1 పరీక్షల్లో అమలు చేస్తున్న జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని చెప్పి కొందరు అభ్యర్థులు చాలా రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అన్ని మార్గాల్లో ప్రభుత్వంపై, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కోర్టుల్లో పోరాడారు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే పలు మార్లు గ్రూప్ 1 పరీక్షలో గందరగోళం నెలకొనడంతో ఈసారి పరీక్ష జరిపే తీరాలని భావించింది. ఆ దిశగానే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది.
రిజర్వేషన్ల విషయంలో పట్టువీడాలని కోరుతూ ఫైట్ చేసిన అభ్యర్థులు ముందుగా హైకోర్టులో సింగిల్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. అక్కడ వాళ్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. తర్వాత తెలంగాణ హైకోర్టులోని డివిజన్ బెంచ్‌కు వెళ్లినా అనుకూలంగా తీర్పు రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా చుక్క ఎదురైంది.
కోర్టుల్లో పోరాడుతూనే రాజకీయంగా కూడా వారు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ్టి నుంచి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఆపేందుకు శతవిధాలుగా యత్నించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిశారు. ఈ పోరాటానికి ఆయన మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం పట్టు వీడి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది బీఆర్‌ఎస్ పార్టీ.
బీజేపీ నేతలు అయితే ఏకంగా గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఆదివారం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. సీఎంను కలిసి సమస్య వివరిస్తూమంటూ అశోక్ నగర్ నుంచి గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి పాదయాత్రగా కదిలారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రూప్ వన్ అభ్యర్థులను చెదరగొట్టి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకొని తన నివాసంలో విడిచిపెట్టారు.
తాజాగా ఇవాళ బీసీ సంఘాలు గవర్నర్‌కు రిప్రజంటేషన్ ఇచ్చాయి. రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వానికి సూచనలు చేయాలని రిక్వెస్ట్ చేశాయి. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా పలుమార్లు రిప్రజంటేషన్స్ ఇచ్చామని ప్రభుత్వం మేల్కుంటే మంచిదని లేకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. గవర్నర్‌కు కలిసి ప్రభుత్వాన్ని విమర్శించిన నేతల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మలన్న కూడా ఉన్నారు. ఎటు వైపు నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గలేదు. రెండు గంటల నుంచి మెయిన్స పరీక్షలు నిర్వహించింది. ఇప్పటికి పెండింగ్‌లో ఉన్న కేసులో విషయంలో హైకోర్టు తీర్పును బట్టి తుది ఫలితాలు ఉంటాయని ఇప్పటికే చెప్పింది.