Kishan Reddy : తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు చేశారు. సీఎం  కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలను కలిసే సమయం కూడా లేదని ఎద్దేవా చేశారు.  ప్రజలను అన్ని విషయాల్లో టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని ఆక్షేపించారు. ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కేసీఆర్‌బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.


వైఫల్యాలు కప్పిపుచ్చుకొనేందుకు ఆరోపణలు 


టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకిలా మోత అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఫీజు రీయాంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, వ్యవసాయానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన సాల్కర్‌ షిప్ లు సవ్యంగా అమలుచేయడంలేదని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధుల వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.  ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్న చెల్లింపులు కూడా సకాలంలో జరపడం లేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల నిధులపై చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.  


గెలిపిస్తే గాలికొదిలేశారు


రెండు సార్లు టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇచ్చిన హామీలు గాలికొదిలేదని మోసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊహల్లో విహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్పు చేయకుంటే జీతాలివ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. భూములు అమ్ముకోకపోతే పూటగడవని పరిస్థితి ఉందన్నారు.  లోపాలు చెబితే పక్షపాతం అంటారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గవర్నర్ అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదని మండిపడ్డారు.  


ప్రభుత్వ భూముల విక్రయం 


అప్పులు కావాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ లో మార్పుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయం జరిగిందని రైతులు దరఖాస్తు చేసుకుంటే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గురుకులాలు, హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై ధర్నాలు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 


Also Read : YS Sharmila: ఆయన మోసగాడు, రంగులు మార్చడంలో దిట్ట - షర్మిల ఘాటు వ్యాఖ్యలు


Aslo Read : Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ