Hyderabad News: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్! నేడు ఉప్పల్‌లో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు పెద్ద ఎత్తున ఉండనున్నాయి. ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియానికి ఉదయం నుంచే అభిమానులు చేరుకుంటుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించనున్నారు. టికెట్లు ఉన్న వారు మాత్రమే రావాలని పోలీసులు  సూచించారు. మ్యాచ్ ముగిశాక ఈ సారి TSIIC నుంచి బయటకు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. దీంతో ప్రేక్షకులు త్వరగా బయటకు వెళ్లే అవకాశం ఉంది. తర్వాత వారి గమ్య స్థానాలకు చేరుకొనేందుకు హైదరాబాద్ మెట్రో సర్వీసులు అర్ధరాత్రి దాటే వరకూ నడవనున్నాయి.


భారీ బందోబస్తు ఏర్పాటు
ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ కోసం దాదాపు 2,500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మ్యాచ్‌ నేడు సాయంత్రం జరగనున్నందున మరోసారి బాంబ్ డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు.


ఈ గేట్ల ద్వారా లోనికి ఎంట్రీ
ఉప్పల్ స్టేడియానికి మొత్తం 12 గేట్లు ఉండగా, ఒకటో నెంబరు గేట్ నుంచి భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇతర ప్రముఖులకు అనుమతి ఉంటుంది. రెండో నెంబరు గేట్ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీయూ) ప్రతినిధులు, మీడియా, పోలీసులకు అనుమతి ఉంటుంది. 10, 12వ గేట్లు మూసిఉంచనున్నారు. 4 నుంచి 9 గేటు వరకూ ప్రేక్షకులను అనుమతించనున్నారు. మ్యాచ్ ముగిశాక ఈ సారి టీఎస్ ఐఐసీ నుంచి బయటకు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. 


పార్కింగ్‌ ప్రదేశాలివే..
క్రికెట్ మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చే వారికి 21 పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశారు. హబ్సిగూడ నుంచి ఉప్పల్‌ రోడ్‌లో ఏక్‌ మినార్‌ ఎడమవైపున వాహనాలను నిలపవచ్చు. ఉప్పల్‌ - రామంతపూర్‌ వైపు వచ్చే వారు రామంతాపూర్‌ - ఉప్పల్‌ వైపు ఉన్న సినీపొలిస్, మోడ్రన్‌ బేకరీ, డీఎస్‌ఎల్, అవెయా మరియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్థలాల్లో పార్క్‌ చేయొచ్చు. ఉప్పల్‌ నుంచి హబ్సిగూడ వైపు వచ్చే వాహనాలు జెన్‌పాక్ట్‌ సర్వీసెస్‌ రోడ్, హిందూ ఆఫీసు, మెట్రో రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌ ప్రదేశాల్లో నిలుపుకోవచ్చు.


అర్ధరాత్రి దాటే దాకా నేడు మెట్రో రైళ్లు
క్రికెట్ మ్యాచ్‌ ను చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఇంటికి చేరుకొనేందుకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అభిమానులు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా ‘స్టేడియం’ మెట్రో స్టేషన్‌ నుంచి స్పెషల్ మెట్రో రైళ్లను నడపనుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ రైలు సర్వీసులు నడుపుతామని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. అయితే, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత కావాల్సిన స్టేషన్లలో ప్రయాణికులు దిగొచ్చు. అమీర్‌పేట, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి ఇతర కారిడార్లలోకి మారేందుకు కనెక్టింగ్‌ రైళ్లు అందుబాటులో ఉంచుతున్నారు.