Jyotiraditya Scindia on KCR : హైదరాబాద్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం తిరోగమనంలో ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణలో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని విర్శించారు. హైదరాబాద్ చంపాపేటలో జరిగిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తుందని, ఆ నిధులు సద్వినియోగం అయ్యాయో లేదో తేల్చాల్సి ఉందన్నారు. టీఆర్ఎస్ నేతలు తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారన్నారు. తెలంగాణ నేతల కృషితో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. తెలంగాణలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని ఆరోపించారు.
హైదరాబాద్ లో కేంద్ర మంత్రి
హైదరాబాద్ పార్లమెంట్ లబ్దిదారుల సమావేశం గౌలిపురలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు. కేంద్ర మంత్రి సింధియా స్థానిక నేతలతో పాటు, కేంద్ర పథకాల లబ్దిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 133 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి పథకాలు లబ్ది చేకూర్చే విధంగా ఉన్నాయని తెలియజేశారు. పావలా వడ్డీ , ముద్ర లోన్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌలిపురా బీజేపీ కార్పొరేటర్ అల్ భాగ్య , స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఉదయం బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఇంటికి కేంద్రమంత్రి వెళ్లారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సింధియా దర్శించుకున్నారు. అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ రోడ్లపై సింధియా సెటైర్
హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు విస్తరించడం లేదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశ్నించారు. పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. సింధియా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సింధియా మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీ సంక్షేమం - అభివృద్ధి బీజేపీ విధానమని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయం చరిత్రాత్మకమైందని, అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లే రోడ్లపై జ్యోతిరాదిత్య సింధియా సెటైర్ వేశారు. ఈ మేరకు సింధియా ట్వీట్ చేశారు.
సింధియా ట్వీట్
హైదరాబాద్ లో ఉన్న రోడ్లను చూసి తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కేవలం 10 నిమిషాల దూరానికి సుమారు 30 నిమిషాలు పట్టిందని ఆరోపించారు. రూ. పది వేల కోట్లతో వెయ్యి కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని, కానీ అది వాస్తవరం కాదని ఆయన ట్వీట్ లో రాశారు. హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. భారీగా వరద పోటెత్తడంతో వాహనాలు, వస్తువులు వర్షాపు నీటిలో కొట్టుకపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.