తెలంగాణలో నియంతృత్వ, కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఉద్యోగులు, ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన... ఉద్యోగులకు మద్దతిచ్చేందుకే హైదరాబాద్‌ వచ్చినట్టు స్పష్టం చేశారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఈ జీవోను సవరించాలని బండి సంజయ్‌ శాంతియుతంగా నిరసన చేస్తుంటే కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకెళ్లి అరెస్టు చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని నడ్డా అన్నారు.  


Also Read:  తెలంగాణ హైకోర్టులో కొవిడ్, ఒమిక్రాన్‌పై విచారణ.. నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్


బీజేపీ ధర్మ యుద్ధం చేస్తుంది


తెలంగాణలో బీజేపీ ధర్మయుద్ధం చేస్తోందని జేపీ నడ్డా అన్నారు. ఈ ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అంతిమ నిర్ణయం వచ్చే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. హుజూరాబాద్‌ ఫలితాన్ని తెలంగాణ మొత్తం చూపిస్తామన్నారు. దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని జేపీ నడ్డా ఆరోపించారు.  దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమి సీఎం కేసీఆర్​ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అందుకే నియంతృత్వ పోకడలకు పాల్పడుతున్నారన్నారు. ధర్నాచౌక్‌ వద్ద ధర్నాలు వద్దన్న టీఆర్ఎస్ నేతలే ధర్నాచౌక్‌లో నిరసన చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డికి ఒక్క నీటిచుక్క ఇవ్వలేదని ఆరోపించారు. 


Also Read: ఓ వైపు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?


ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ


బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ చేపట్టిన ర్యాలీ హైటెన్షన్ కు దారితీసింది. పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తీరుతామని, ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరని జేపీ నడ్డా అన్నారు. బీజేపీ నేతలు చెప్పినట్టుగానే శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేశారు. తర్వాత జేపీ నడ్డా బీజేపీ నేతలు గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. బండి సంజయ్‌ను విడుదల చేయాలని బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ నేతలు నల్లమాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, పార్టీ నేతలు వివేక్‌, విజయశాంతి, ప్రేమేందర్‌రెడ్డి, రామచంద్రరావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిరంకుశ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.


Also Read: ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తాను... అరెస్టు చేస్తే అప్పుడు చూద్దాం... సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన జేపీ నడ్డా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి