భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగుతోంది. టీ సమయానికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. భారత్ స్కోరుకు కేవలం 11 పరుగుల దూరంలో దక్షిణాఫ్రికా నిలిచింది. మార్కో జాన్సెన్ (2 బ్యాటింగ్: ఐదు బంతుల్లో), కేశవ్ మహరాజ్ (11 బ్యాటింగ్: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ టెస్టుల్లో ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటిసారి.
ఈ సెషన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ మొదటి సెషన్‌కు రిపీట్‌లా సాగింది. టెంపా బవుమా, కైల్ వెరేయిన్ 20 ఓవర్ల పాటు వికెట్ కోల్పోకుండా ఆడారు. అయితే అభిమానులు ముద్దుగా ‘లార్డ్’ అని పిలుచుకునే శార్దూల్ ఠాకూర్ దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టాడు. క్రీజులో నిలదొక్కుకున్న టెంపా బవుమా, కైల్ వెరేయిన్‌లను శార్దూల్ ఠాకూర్ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. 68వ ఓవర్లో రబడను షమి అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కూడా కోల్పోయింది.
ఈ ఇన్నింగ్స్‌లో శార్దూల్‌కు ఐదు వికెట్లు దక్కగా.. షమి రెండు వికెట్లు తీసుకున్నాడు. భారత్ స్కోరుకు దక్షిణాఫ్రికా 11 పరుగుల దూరంగా ఉన్నందున ఇప్పుడు పోరు మరింత ఆసక్తికరంగా మారింది. మూడో సెషన్‌లో దక్షిణాఫ్రికా టెయిలెండర్లు పోరాడతారా.. కుప్పకూలుతారా అనే అంశం మీద మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.