ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల రాజకీయ పార్టీ పెడతారా ? పెట్టకూడదన్న రూల్ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించడం వెనుక మర్మం ఉందా ? ఒక వేళ షర్మిల ఏపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఏపీలో రాజకీయ  పార్టీ పెట్టబోతున్నారని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ అంశంపై ఎప్పుడూ ఆమె అధికారికంగా మాట్లాడలేదు. తొలి సారిగా సోమవారం ...  ఏపీలో పార్టీ పెట్టకూడదన్న రూల్ ఉందా.. అని ప్రశ్నిస్తూ ... పార్టీ పెట్టను అనే అంశాన్ని  రూల్ అవుట్ చేసేశారు. అలాగని పెడతానని కూడా చెప్పలేదు. కానీ ఆ వైపు మొగ్గు ఉందన్నట్లుగా మాట్లాడారు. దానికి కారణం గతంలో తెలంగాణలోనే రాజకీయం చేస్తానని ఆమె ప్రకటించి ఉండటం. 


Also Read: వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?


తెలంగాణలో పార్టీ ప్రారంభించినప్పుడు ఇక తన జీవితం తెలంగాణ ప్రజలకే అంకితమని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆమె రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న తల్లి విజయలక్ష్మి కూడా తన ఇద్దరు బిడ్డలు  రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేయాలని దేవుడు రాసి పెట్టారని అలాగే జరుగుతోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపీలో... షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తారని ఆమె స్పష్టం చేశారు.  తల్లి మాటలకు తగ్గట్లుగానే షర్మిల తాను తెలంగాణకే అంకితమని చెబుతూ వస్తున్నారు.  కానీ అనహ్యంగా ఇప్పుడు వాయిస్ మారిపోయింది. ఏపీలోనూ పార్టీ పెట్టవచ్చనే ఊహాగానాలకు కారణం అవుతున్నారు. 


Also Read: నాతో రండి.. సమస్యల్లేకపోతే ముక్కు నేలకు రాస్తా, ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించే మగాడే లేడు: షర్మిల


పార్టీ పెట్టకూడదన్న రూల్ ఏమైనా ఉందా ? అన్న షర్మిల ప్రశ్న వెనుక చాలా సమాధానాలున్నాయన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. షర్మిల సోదరుడు జగన్‌ మధ్య పొసగడం లేదని కొంత కాలంగా వినిపిస్తున్న వాదన. దాన్ని బలపరిచేలా వారిద్దరూ ఎదురు పడటం... మాట్లాడుకోవడం ఇటీవలి కాలంలో జరగడం లేదు. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని... ఆ సమయంలోనే కుటుంబ పరంగా ఓ ఒప్పందం జరిగిందన్న ప్రచారం ఉంది. అదేమిటంటే... షర్మిల ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు... కుటుంబ పరంగా చేయాల్సిన న్యాయం అంతా  షర్మిలకు చేస్తామని ఒప్పందం జరిగిందంటున్నారు. అయితే ఇప్పుడు తమకు హామీ ఇచ్చినట్లుగా న్యాయం చేయడం లేదని ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇప్పుడు .. తాను మాత్రం ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టకూడదనే రూల్ ఎందుకు అమలు చేస్తానని ఆమె ఆ ప్రశ్న ద్వారా సందేశం పంపారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. 


Also Read: ఏం సంబంధం ఉందని వైఎస్ఆర్‌సీపీ కోసం శక్తికి మించి పని చేశా ! జగన్ నిరాదరణపై కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు !


తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీకి అనుకున్నంత హైప్ రాలేదు. ఎంత లోకలైజ్ అయ్యే ప్రయ.త్నం చేసినా ఆమెను  ప్రజలు తెలంగాణ  బిడ్డగా గుర్తించడం కష్టమే. అదే ఏపీలో అయితే ఈ సమస్య ఉండదు. ఏపీలో ఆమె కూడా సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల్లోకి వస్తే వైఎస్ అభిమానులుగా ఉన్న వాళ్లు.. వైఎస్ఆర్‌సీపీ ఓటు బ్యాంకులో కీలకంగా ఉన్న వారు షర్మిలకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే తెలంగాణ కన్నా ఎక్కువగా షర్మిల ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపుతారు. కానీ సోదరుడికి మాత్రం తీవ్ర నష్టం కలుగచేసిన వారవుతారు. అలాంటి పని ఆమె చేస్తారా అన్నది కూడా డౌటే. 


Also Read: ఏపీలో పార్టీ పెట్టొచ్చు.. పెట్టకూడదన్న రూలేమన్నా ఉందా ? : షర్మిల


మొత్తంగా చూస్తే షర్మిల ఏపీలో పార్టీ పెట్టబోరు అని తేల్చేయడం ఎంత కరెక్ట్ కాదో.. పెడతారు అని చెప్పడం కూడా అంతే తొందరపాటు. వైఎస్ కుటుంబంలో ఉన్నట్లుగా చెబుతున్న విభేదాలు సమసిపోతే.. అసలు  ఏపీలో పార్టీ అన్న మాటే వినిపించదు. కానీ ముదిరితే మాత్రం సంచలనాలు నమోదయ్యే అవవకాశమే ఎక్కువగా ఉంటుంది .


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి