Bandi Sanjay : పదవి పోతుందన్న భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ప్రమాణ సవాల్ పై కౌంటర్ ఇచ్చారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి అందరూ రావాలన్న తమ లక్ష్యం నెరవేరిందన్నారు. సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారని అనలేదని, కాంగ్రెస్ కు ఇచ్చారని ఈటల అన్నారన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారన్నారు.  కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి  కూడా ఇదే మాటలు చెప్పారన్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్ఎస్ వద్ద కాంగ్రెస్‌ డబ్బు తీసుకున్న మాట వాస్తవమన్నారు.  అతిక్ అహ్మద్ లాంటి గుండా చనిపోతే ఎంఐఎం పార్టీ సంతాప సభలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అతిక్ అహ్మద్ మరణంపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్పందించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. 


ఓటుకు నోటుకు కేసులో జైలుకెళ్లిన రేవంత్ తో నాకు పోలికా? 


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయంగానే తాను మాట్లాడాను కానీ ఎవరినీ కించపరచలేదన్నారు. తాను రేవంత్‌రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ కలిసి ఉంటున్నారన్నారు. రేవంత్‌ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా అసభ్యంగా మాట్లాడారన్నారు. రాజకీయ నేతలు కన్నీళ్లు పెట్టడం మంచిదికాదన్న ఈటల... రేవంత్‌రెడ్డికి, తనకు పోలికా అంటూ నిలదీశారు. విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచీ తాను పోరాటాలు చేస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. ఓటుకు నోటుకు కేసులో రేవంత్‌ రెడ్డి జైలుకువెళ్లి వచ్చారని గుర్తుచేశారు. రేవంత్ సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల రాజేందర్ విమర్శించారు. 


రేవంత్ రెడ్డి ఏమన్నారంటే? 


మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రుజువు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌పై చేశారు. ఈ మేరకు శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణానికి రావాలని ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేశారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. మునుగోడు ఉపఎన్నికల్లో  కేసీఆర్ వద్ద నుంచి తాము ఒక్క రూపాయి తీసుకున్నా సర్వనాశనం అయిపోతామన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో  బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వందల కోట్లు ఖర్చుపెట్టాయన్నారు. ఒక్క మద్యం అమ్మకాలే మూడు వందల కోట్లు నమోదయ్యాయన్నారు. అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నానని.. చివరి రక్తపు బొట్టు  వరకూ కేసీఆర్ తో పోరాడుతానన్నారు. గర్భగుడిలో ప్రమాణం చేసి చెబుతున్నానని కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదన్నారు.   కేసీఆర్‌తో కొట్లాడటానికే మా జీవితాలు ధారపోస్తున్నామని..  నన్ను అమ్ముడుపోయారని అంటావా అని ఈటలపై మండిపడ్డారు.  కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు..ఇది చిల్లర రాజకీయం కాదు.. పోరాటమని రేవంత్ స్పష్టం చేశారు.  నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు.. రేవంత్ రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదన్నారు.  నేను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతా నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నా ఏకైక లక్ష్యం.. కేసీఆర్ ను గద్దె దించడమేనని స్పష్టం చేశారు.