Kuno National Park:


 
తప్పి పోయిన చీతా 


కునో నేషనల్ పార్క్ (KNP) నుంచి తప్పిపోయిన చీతాను అధికారులు రక్షించారు. గత వారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ బార్డర్‌ని దాటి యూపీలోని అడవిలోకి వెళ్లిపోయింది చీతా. ఇది గుర్తించిన పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. చీతా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. మొత్తానికి పట్టుకుని మళ్లీ నేషనల్ పార్క్‌లోకి తీసుకొచ్చారు. ఈ నెలలో ఇలా చీతా దారి తప్పడం ఇది రెండోసారి. పార్క్ నుంచి చాలా దూరం ప్రయాణించిన చీతా ఎక్కడో తప్పిపోయింది. కేరళలోని శివ్‌పురి జిల్లా అడవిలోకి వెళ్లిపోయిందని అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టి శనివారం (ఏప్రిల్ 22) రాత్రి 9.30 నిముషాలకు నేషనల్ పార్క్‌లో వదిలారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలోని అడవికి వెళ్తున్న చీతాను గుర్తించి పట్టుకొచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కునో నేషనల్ పార్క్ నుంచి ఝాన్సీ ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరం ఉంది. ఇన్ని కిలోమీటర్లూ దారి తప్పి వెళ్లిపోయింది మగ చీతా. గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. అప్పటి నుంచి వాటిని సంరక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీతాల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా వీటిని నమీబియా నుంచి తీసుకొచ్చారు. అయితే...వీటిలో ఓ చీతా చనిపోయింది. కిడ్నీ సమస్యతో చాలా రోజుల పాటు అనారోగ్యానికి గురైన చీతా ఈ ఏడాది మార్చి 27న ప్రాణాలు కోల్పోయింది. 


సౌతాఫ్రికా నుంచి..


సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో వీటిని తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నాయి. వీటిని నేరుగా కునో నేషనల్ పార్క్‌కు చేర్చుతారు. ఈ 12 చీతాల్లో 7 మేల్, కాగా మిగతా 5 ఫిమేల్. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. రెండో విడతలో 12 చీతాలను దిగుమతి చేసుకున్నారు. చీతాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ స్పెషల్‌ టీమ్‌ని ఏర్పాటు చేసింది కేంద్రం. Cheetah Reintroduction Programmeలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఇప్పటికే 8 చీతాలను తెప్పించింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడ్డాక ఒక్కొక్క చీతాను బయటకు వదులుతున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా,భారత్ మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. సౌతాఫ్రికా, నమీబియా, బోత్స్‌వానాలో దాదాపు 7 వేల చీతాలున్నట్టు అంచనా. వీటిలో నమీబియాలోనే (Namibia Cheetahs) అత్యధికంగా చీతాలున్నాయి. భారత్‌లో పూర్తిగా ఇవి అంతరించిపోవడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి తెప్పిస్తోంది కేంద్రం. చివరి సారిగా భారత్‌లో 1948లో ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో సల్ అడవుల్లో కనిపించింది. అందుకే వీటి సంఖ్య పెంచాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.


Also Read: Amarjeet Sada: వయసు 8 ఏళ్లు, చేసింది మూడు హత్యలు - వెన్నులో వణుకు పుట్టించే క్రిమినల్ కథ