IPL 2023, RCB vs RR: ఐపీఎల్ - 16 లో నేడు మరో డబుల్ హెడర్ జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రాజస్తాన్ రాయల్స్ మధ్య మరో ఆసక్తకిర సమరం జరుగనుంది. వాంఖెండే మాదిరిగానే చిన్నస్వామి స్టేడియంలో కూడా మరో పరుగుల ప్రవాహం తప్పదని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ బ్యాటర్ల త్రయం కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ వర్సెస్ (కేజీఎఫ్) రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్) గా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు.
మళ్లీ గెలుపు బాట పట్టేందుకు..
ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరేట్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ప్రస్తుతం టేబుల్ టాపర్స్‌గా ఉంది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి రెండు మాత్రమే ఓడింది. రాజస్తాన్ గత మ్యాచ్‌లో జైపూర్ వేదికగా లక్నోతో తలబడి 150 ప్లస్ స్కోరు చేయలేక చతికిలపడింది. కానీ చిన్నస్వామిలో మాత్రం మళ్లీ పుంజుకుని విజయాల బాట పట్టాలని చూస్తున్నది. ఆ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్ మంచి టచ్ లో ఉన్నారు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే చిన్నస్వామిలో పైన పేర్కొన్న వారిలో ఏ ఇద్దరూ కుదురుకున్న భారీ స్కోరు పక్కా. కాగా వరుసగా విఫలమవుతున్న రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకోకపోవచ్చు.
బౌలింగ్ లో రాజస్తాన్ కూడా బలంగానే ఉంది. కొత్త బంతితో ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నాడు. హోల్డర్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. అశ్విన్, చాహల్ లు స్పిన్ తో మాయచేయగలిగితే బెంగళూరుకు తిప్పలు తప్పవు.
స్వంత అభిమానుల మధ్యలో..
చిన్నస్వామి ఆర్సీబీకి హోంగ్రౌండ్. ఈ సీజన్ లో బెంగళూరు ఇక్కడ ముంబై, ఢిల్లీ, చెన్నైతో మ్యాచ్ లు ఆడింది. ముంబై, ఢిల్లీలను ఓడించి చెన్నై చేతిలో ఓడింది. ఆర్సీబీలో కూడా కెజిఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిన్) వీరబాదుడు బాదుతున్నారు. కానీ మిడిలార్డర్ లో ఆ జట్టు దారుణంగా విఫలమవుతోంది. లోమ్రర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లు ప్రభావం చూపడం లేదు.
బౌలింగ్ లో సిరాజ్ ఆర్సీబీ ప్రధాన ఆయుధం. ఈ మ్యాచ్ కు ఆసీస్ పేసర్ జోష్ హెజిల్వుడ్ ఆడే అవకాశముందని ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి. అతడు వస్తే పార్నెల్ బెంచ్ కే పరిమితం కావొచ్చు. స్పిన్ బాధ్యతలు మోస్తున్న హసరంగ.. శాంసన్ గ్యాంగ్ ను ఏ మేరకు కొట్టకుండా నిలువరిస్తాడో చూడాలి. కాగా నేటి మ్యాచ్ లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనుంది. 2011 నుంచి ప్రతీ ఏడాది ఆర్సీబీ.. ఐపీఎల్ లో ఏదో ఒక మ్యాచ్ లో గ్రీన్ జెర్సీతో ఆడుతున్న విషయం తెలిసిందే.
పిచ్ రిపోర్ట్ : చిన్నస్వామి బ్యాటర్లకు స్వర్గధామం. చెన్నై - బెంగళూరు మధ్య ముగిసిన గత మ్యాచ్ లో రెండు జట్లూ 400 ప్లస్ స్కోరు చేశాయి. నేటి పోరులో కూడా భారీ పరుగుల ప్రవాహం తప్పదు. టాస్ గెలిచిన జట్లు ఛేదనకే మొగ్గుచూపొచ్చు. ఛేజింగ్ చేసే టీమ్స్ కు ఇక్కడ 60 శాతం విజయావకాశాలున్నాయి.
హెడ్ టు హెడ్ : ఇరు జట్ల మధ్య ఐపీఎల్ లో 27 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్ లు ఆర్సీబీ నెగ్గగా రాజస్తాన్ 12 గెలిచింది. రెండింటిలో ఫలితం తేలలేదు. చిన్నస్వామిలో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్ లు జరగగా నాలుగు సార్లు రాజస్తాన్ నే విజయం వరించింది.
తుది జట్లు (అంచనా) :
రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, సుయాశ్ ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్