Arshdeep Breaks Stumps: ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య శనివారం రాత్రి వాంఖెడే వేదికగా ఉత్కంఠగా ముగిసన మ్యాచ్‌లో పంజాబ్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ ‘బంతిని బాదుడు’ కార్యక్రమంలో హోరాహోరిగా తలపడినా చివరికి రోహిత్ సేనకు పరాభవం తప్పలేదు. మ్యాచ్ అంతా ఒకెత్తు అయితే టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్ వేరే లెవల్. అర్ష్‌దీప్ వేగానికి వికెట్లు విరిగిపోయాయి.
ఏం జరిగిందంటే..
215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై రోహిత్ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57) ల విజృంభణతో విజయానికి దగ్గరగా దూసుకెళ్లింది. చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు కావాలి. క్రీజులో టిమ్ డేవిడ్, తిలక్ వర్మ. ఫస్ట్ బాల్‌కు ఒక పరుగే వచ్చింది. రెండోది డాట్ బాల్. మూడో బంతి యార్కర్. వేగంగా దూసుకొచ్చిన బంతిని అంచనా వేయడంలో తిలక్ వర్మ గతి తప్పాడు. కానీ బాల్ మాత్రం తప్పలేదు. మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. నాలుగో బాల్‌కు క్రీజులో బ్యాటర్ మారాడు. సేమ్ బాల్. సేమ్ సీన్ రిపీట్. మరో వికెట్ కూడా విరిగింది.
కాస్ట్ ఎంతో తెలుసా..?
అర్ష్‌దీప్ రెండుసార్లు వికెట్లు విరగ్గొట్టాడు. ముంబైని గెలిపించాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా విరిగిన వికెట్ ధర ఎంత..? అసలే అది ఎల్‌ఈడీ స్టంప్. వాటి పైన ఉంచే బెయిల్స్ కూడా ఎల్‌ఈడీవే. ఐపీఎల్ - 2023 కోసం వినియోగిస్తున్న ఒక ఎల్‌ఈడీ స్టంప్స్, వాటిపైన వాడే బెయిల్స్ సెట్ ధర 40 వేల డాలర్లు. అంటే ఇంచుమించు రూ. 30 లక్షలు. బెయిల్స్ ను జింగ్ బెయిల్స్ అని పిలుస్తారు. బెయిల్స్ ధరను సెపరేట్ చేస్తే కేవలం స్టంప్స్ సెట్ ధర రూ. 24 లక్షలని అంచనా. కాగా ఎల్ఈడీ స్టంప్స్ ను మొట్టమొదటిసారిగా 2014 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో వాడింది ఐసీసీ. ఐపీఎల్‌లో వాడే ఎల్ఈడీ స్టంప్స్, జింగ్ బెయిల్స్ ను ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ సమకూరుస్తున్నది.
అర్ష్‌దీప్ దెబ్బకు ముంబైకి హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఓటమి ఎదురైంది. లక్ష్య ఛేదనలో ఆ జట్టు ఓ దశలో అసలు చివరి ఓవర్ ఆడకుండానే గెలుస్తుందోమోననిపించింది. చాలాకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతూ సున్నాలు చుడుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్ తో ఏడాది క్రితం నాటి సూర్యను గుర్తు చేశాడు. ఆడింది 26 బంతులే అయినా 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సూర్య మరో ఓవర్ క్రీజులో ఉండుంటే ఫలితం కచ్చితంగా మరో విధంగా ఉండేది. ఉన్న కాసేపే అయినా క్రీజులో తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు సూర్య.. మ్యాచ్ ఓడినా ముంబై అభిమానులు కూడా సంతోషించదగ్గ పరిణామం ఇది అని చెప్పడంలో సందేహమే లేదు.