Bandi Sanjay : తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. అది మంచి నిర్ణయమే అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు శాశ్వతంగా దళితుడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని సవాల్ చేశారు. కొత్త సచివాలయంలో సీఎం కొత్త సీట్లో దళితుడినే కూర్చోబెట్టాలన్నారు. దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్నే మారుస్తానని ప్రకటించిన కేసీఆర్ దిల్లీ లిక్కర్ స్కామ్ లో వీడియోలు బయటపడటంతో చర్చను దారి మళ్లించేందుకు అంబేడ్కర్ రాగం ఎత్తుకున్నారే తప్ప ఆయనపై ప్రేమతో కానేకాదని అన్నారు.
కేంద్ర బలగాలతో పరేడ్
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 4వ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్... ఇంజినీర్స్ డేను పురస్కరించుకుని భారతరత్న స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అమిత్ షా నేతృత్వంలో పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ బలగాల పరేడ్ ఉంటుందని, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రేపు స్ఫూర్తి కేంద్రాలను సందర్శిస్తామని, ఎల్లుండి ఉదయం 8 గంటలకు అందరూ పరేడ్ గ్రౌండ్స్ కి రావాలని కోరారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాతే సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతానని ప్రకటించారన్నారు. ఎంఐఎం పార్టీని సంతృప్తి పరచడానికే జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుతున్నారని ఆరోపించారు.
విమోచన దినోత్సవం జరిపితే హిందువులను వ్యతిరేకించినట్టా?
"ఈ 8 ఏళ్లలో ఎందుకు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపలేదు? సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికుల శక్తినే ప్రశ్నిస్తున్నారు. ప్రూఫ్స్ కావాలంటారు. హిందువుల కోసం ప్రశ్నించే వాళ్లను జైల్లో పెడతారు. దాడులు చేయిస్తున్నోళ్లే మళ్లీ జాతీయ సమైక్యత గూర్చి మాట్లాడుతున్నారు. ఆనాడు తెలంగాణ బిడ్డలు పడుతున్న బాధలకు విముక్తి కల్పించిన భరతమాత ముద్దుబిడ్డ సర్ధార్ వల్లభాయ్ పటేల్. మనం సర్దార్ పటేల్ ను గుర్తుంచుకోవాలి. తెలంగాణ విమోచన దినోత్సవం జరిపితే హిందువులను వ్యతిరేకించినట్టా? సమైక్యత దినోత్సవం జరిపితే ముస్లింలను గౌరవించినట్టా కేసీఆర్?కేసీఆర్ పాత చరిత్రను తెరమరుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపితే సంతోషించేవాళ్లం. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడిన గడ్డ ఇది." - బండి సంజయ్
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ?
దిల్లీ లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అంబేడ్కర్ నామస్మరణ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి భవనం జాడ ఏదన్నారు. 12 మంది దళితులను కేంద్ర మంత్రులను, దళితుడిని రాష్ట్రపతిని చేయడంతో పాటు ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఘనత బీజేపీదన్నారు. కేంద్రంలో దళితులకు ఎంతో చేశామని, ఇక్కడ కేసీఆర్ దళితులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Amit Shah Hyderabad Tour: హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు, మరోసారి TRS వర్సెస్ BJP తప్పదా !
Also Read : Gutta Sukender: విలీనం, విమోచనం అంటే అర్థం తెలియనోళ్లూ మాట్లాడుతున్నారు - గుత్తా సుఖేందర్