Amit Shah Hyderabad Tour: హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దిన వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 16వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీకి వెళ్తారు. అమిత్ షా రాత్రి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 17 వ తేదీన ఉదయం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. 8.45 గంటల నుండి 11.45 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర విమోనచ దిన వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. 


విమోచన వేడుకలు.. మోదీ బర్త్ డే వేడుకలు 
రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు కేంద్ర మంత్రి అమిత్ షా. తర్వాత పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజాకు చేరుకుని పార్టీ ముఖ్యనేతలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమిత్ షా సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌ కు చేరుకుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అదే కార్యక్రమంలో వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తారు. తిరిగి సాయంత్రం రాజేంద్రనగర్ లోని పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. అమిత్ షా రాక సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7.30కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 




Amit Shah to visit 



అటు విమోచనం.. ఇటు విలీనం 
బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేయగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలీన దినోత్సవం జరిపేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు వజ్రోత్సవాలను గుర్తుండి పోయేలా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఇదే రోజుల్లో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేయాలని అధికారులకు సూచనలు అందాయి. విద్యుత్ దీపాలతో ఆఫీసులను అలంకరిస్తున్నారు. అసెంబ్లీ, బీఆర్ కే భవన్, జీహెచ్ఎంసీ, డీజీపీ ఆఫీసులు.. విభిన్న రంగుల్లో మెరిసి పోతున్నాయి. 


మూడ్రోజుల పాటు వేడుకలు.. 
మూడు రోజుల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న రాష్ట్రమంతటా జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను, సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పిన కవులు, కళాకారులు, ఇతర ప్రముఖులకు సన్మానం చేయనున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.