హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. మీ రెండు పార్టీలు కుమ్మక్కైయ్యాయి.. లేదు మీ రెండు పార్టీలే కుమ్మక్కైయ్యాయని మాటకి మాట బదులిస్తున్నారు. ఈటల రాజేందర్ బీజీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి అని మంత్రి కేటీఆర్ అగ్గిలో ఆజ్యం పోశారు. కేటీఆర్ కామెంట్స్ పై బీజేపీ, కాంగ్రెస్ గట్టిగానే బదులిచ్చాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. గోల్కొండ రిసార్ట్స్‌లో తాను, ఈటల కలిశామని కేటీఆర్‌ అంటున్నారని, అది బహిరంగ రహస్యమే అన్నారు. ఈటల రాజేందర్‌తో చీకటి ఒప్పందం కోసం కలవలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. వేం నరేందర్‌రెడ్డి కుమారుడి లగ్న పత్రిక సందర్భంగా తాము కలిశామన్నారు. కేసీఆర్‌ చేసే కుట్రలన్నీ ఈటల వివరించారన్నారు. ఈటల, కిషన్‌ రెడ్డి భేటీ ఏర్పాటు చేసిందెవరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. కిషన్‌రెడ్డి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిందెవరని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.



Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?


రేవంత్ రెడ్డిని కలిశా..అయితే ఏంటి : ఈటల


హుజూరాబాద్ ఉపఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఈటల రాజేందర్- రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారని కేటీఆర్ చేసిన ఆరోపణలు సంచలనం మారాయి. కాదని చెపితే తాను ఫొటోలు బయటపెడతానని కేటీఆర్ సవాల్ చేశారు. దీనిపై హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. రేవంత్ రెడ్డిని కలిశానని అయితే ఏంటని ప్రశ్నించారు. అయితే రేవంత్ రెడ్డిని కలిసింది బీజేపీలో చేరిన తర్వాత కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత చాలా మందిని కలిశానని అప్పుడే రేవంత్ రెడ్డిని కూడా కలిశానని స్పష్టం చేశారు. 


Also Read: TRS Vs BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత... బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు...


అది నిజం కాదా... అయితే ఫొటోలు బయటపెడతా..: కేటీఆర్


హుజురాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఈటల రాజేందర్  పోటీ చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇది నిజం కాదని వారు చెబితే సంబంధించిన ఫొటోలను బయటపెడతానని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఎలా కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంతో పోటీ చేశాయో అలానే హుజూరాబాద్ లో కూడా పోటీ చేస్తున్నాయని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. మాణిక్యం ఠాకూర్ రూ.50 కోట్లకు పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేసిన ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైన పరిధి దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. 


Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి