కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారంలో ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరుపార్టీల కార్యకర్తలు పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వివాదం ముదిరి ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది. కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సైపై ఒకరు చేయి చేసుకోవడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ మరింత తీవ్రస్థాయికి చేరింది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి పంపించేశారు. ఈ ఘర్షణపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Also Read: హుజూరాబాద్ కోసం నేరుగా రంగంలోకి కేసీఆర్! రెండ్రోజులు ప్రణాళిక ఇలా..
ఇరువర్గాల తోపులాట
సిరిసెడు గ్రామంలో కిషన్‌రెడ్డి రోడ్ షోలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు ఎదురెదురయ్యారు. ఈ సమయంలో జై కేసీఆర్, జై ఈటల అంటూ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు చాలా శ్రమించారు. ఇరువర్గాలకు స్వల్పగాయాలయ్యాయి. కార్యకర్తల బాహాబాహీతో పావుగంట సేపు రోడ్డు మార్గం స్తంభించింది. ఎట్టకేలకు ఇరువర్గాలకు పోలీసులు సర్థిచెప్పి పంపిచేశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం జోరు పెరుగుతోంది. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
Also Read: హుజూరాబాద్ కోసం నేరుగా రంగంలోకి కేసీఆర్! రెండ్రోజులు ప్రణాళిక ఇలా..
టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల పేరు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుందని ఆరోపించారు. వాస్తవానికి లీటర్ పెట్రోలుపై కేసీఆర్ ప్రభుత్వం 41 రూపాయలు దోచుకుంటోందన్నారు. కేసీఆర్ కు ప్రజలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే ఆ పన్నుల మొత్తాన్ని మినహాయించుకోంటూ రూ.60కే లీటర్ పెట్రోలు అందించవచ్చని సవాల్ విసిరారు. రోడ్లు, డ్రైనేజీ, ఇండ్ల నిర్మాణం, రేషన్ బియ్యం సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అయ్యే నిధులను కేంద్రమే అందిస్తోందని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను దారి మళ్లించి ఉప ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తుందని మండిపడ్డారు.