14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా తెలంగాణను తీర్చి దిద్దామని కేటీఆర్ అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న.. తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమించామన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించిన తరువాత అద్భుతమైన పరిపాలన, సంస్కరణలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.  


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు  తెలంగాణతో కలిసి పోవాలని డిమాండ్ చేస్తున్నారంటే.. పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. ఇలాంటి అద్భుతమైన పరిపాలన సాగుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల సంబరాలను అట్టహాసంగా నిర్వహించుకుందామన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్లీనరీని పార్టీ నిర్వహిస్తుందని చెప్పారు. 


'వారం పది రోజులుగా మా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన ఏర్పాట్లు చేసిన పార్టీ నాయకులకు హృదయపూర్వక అభినందనలు. ప్లీనరీకి సుమారు ఆరు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు వస్తారు. వీరందర్నీ పార్టీ రంగు గులాబి దుస్తులు ధరించి రావాలని కోరుతున్నాం. పది గంటలకి ప్లీనరీ ప్రారంభం అవుతుంది. నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకొని 10.45 గంటల వరకు ప్లీనరీ ప్రాంగణంలోకి రావాలి. 11 గంటలకు సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది.' అని కేటీఆర్ చెప్పారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ఈటల రాజేందర్ ఉమ్మడి అభ్యర్థి


కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ లో పోటీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ మాటను వారు కాదని చెప్తే.. దానికి సంబంధించిన సాక్ష్యాలను బయట పెడతానని చెప్పారు.  కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఎలా చీకటి ఒప్పందంతో పోటీ చేశాయో.. అదేవిధంగా హుజూరాబాద్ లో అలానే చేస్తున్నాయని అన్నారు. 


 


'ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వాదిస్తారు. మాణిక్యం ఠాకూర్ 50 కోట్ల రూపాయలకు పీసీసీ పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని... కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. ఎన్నికల కమిషన్ సైతం తన రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకాన్ని ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఇప్పుడు పక్క జిల్లాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తుందేమో.. అనిపిస్తుంది.' అని కేటీఆర్ అన్నారు.


Also Read: TRS Vs BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత... బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు...


Also Read: Bandi Sanjay: లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్... కేంద్రం నిధులతో టీఆర్ఎస్ నేతలు కార్లు కొంటున్నారు... బండి సంజయ్ సంచలన కామెంట్స్  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి