హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో నేతలు జోరు పెంచారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపురంలో మంత్రి హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 'మాకు అన్నం పెట్టిన ఊరు. ఆతిథ్యం ఇచ్చిన ఊరు సింగాపురం. మమ్మల్ని ఆశీర్వదించండి. మరింత సేవ చేస్తాం' అని హరీశ్ రావు అన్నారు. ఆసరా, కళ్యాణ లక్ష్మీ పథకాలు కడుపు నింపవని ఈటల రాజేందర్ విమర్శలు చేస్తున్నారన్నారు. ఈటల హుజూరాబాద్ కు చేసిందేమిటి హరీశ్ రావు ప్రశ్నించారు.


Also Read : హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!


గెలిచినా ఈటల మంత్రి అయ్యేది లేదు 


ఆసరా పింఛన్, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు ప్రజల కడుపులు నింపవని ఈటల రాజేందర్‌ విమర్శించారని, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కేసీర్ కిట్ పనికి రాదని, రైతుంబంధు దండగ అని విమర్శలు చేశారని హరీశ్ రావు అన్నారు. ఆసరా పింఛన్ పరిగ ఏరుకున్నట్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏవిధంగా మేలు చేస్తున్నామో తమకు తెలుసన్నారు. ఈటల రాజేందర్ శ్రీమంతుడు కాబట్టి అతనికి ఇవి అవసరం లేదు ఆసరా పింఛన్ ఎందరికో అండగా నిలిచిందన్నారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌కు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. గెల్లు శ్రీనుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అబద్దాల బీజేపీ మాటలు నమ్మవద్దన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచేదేమి లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదన్నారు. ధరలు పెంచిన బీజేపీని ప్రజలు ఎందుకు గెలిపిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఇంకా కష్టపడి పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటామని హరీశ్ రావు అన్నారు. 


Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !


భారీగా కేంద్ర బలగాలు మోహరింపు ఎందుకు? : బాల్క సుమన్ 


బీజేపీ డైరెక్ట్ గా ఎదుర్కొలేక కేంద్ర ప్రభుత్వం ద్వారా సీఈసీని వాడుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.  సీఈసీని కేంద్రం జేబు సంస్థలా వాడుకుందన్నారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 2000 మంది జవాన్లతో కూడిన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలను హుజూరాబాద్ కి చేరుకున్నాయని తెలిపారు. ఇంత భారీ ఎత్తున బలగాల మోహరింపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి నేరుగా రిపోర్ట్ చేసే అధికారులు ఇక్కడ ఉండి ఏంచేస్తున్నారని బాల్క సుమన్ ప్రశ్నించారు. 


Also Read: ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి