తెలంగాణ రాష్ట్ర సమితి 2 దశాబ్దాల వేడుక ప్లీనరీ ముగిసింది. కొన్ని అంశాలు టీఆర్ఎస్ నేతలకూ మింగుడు పడటం లేదు. వాటిలో ముఖ్యమైనవి హరీష్ రావు, కవిత హాజరు కాకపోవడం. హరీష్ రావు హుజురాబాద్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయనతో పాటు వివిధ మండలాలకు ఇంచార్జ్‌లుగా ఉన్న నేతలు ఎవరూ రావొద్దని టీఆర్ఎస్ హైకమాండ్ ముందుగానే చెప్పింది . దీంతో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషిస్తున్న హరీష్ రావుకు ద్విశతాబ్ది ఉత్సవాల్లో పాలు పంచుకోలేకపోయారు. మామూలుగానే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతోందన్న అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్లుగానే హరీశ్ రావు ప్రస్తావన కానీ.. ఫ్లెక్సీల్లో ఫోటోలు కానీ ఎక్కడా లేవు. 


Also Read : ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !


అలాగే ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత కూడా హాజరు కాకపోవడం టీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. కవిత నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా హాజరయ్యారు. కానీ కవిత మాత్రం హాజరు కాలేదు.ఆమె కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబరాలను నిర్వహించి తిరిగి వచ్చారు.  అయినా ఎందుకు రాలేదన్న అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవితకు జ్వరంగా ఉండటం వల్ల హాజరు కాలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  


Also Read : హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!


అయితే కల్వకుంట్ల కవిత, కేటీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాల్లో ఇద్దరికీ సరిపడటం లేదని చెబుతున్నారు. అందుకే టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కవిత పాల్గొన్నా పెద్దగా ప్రచారం లభించడం లేదని అంటున్నారు. ఇటీవలి కాలంలో కేటీఆర్, కవిత కలసి పాల్గొన్న కార్యక్రమాలు కూడా లేవు. ఇలాంటి వాటి వల్ల ఇరువురి మధ్య విభేదాలున్నాయన్న ప్రచారానికి బలం చేకూరుతోంది.  ప్లీనరీ మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో జరగడంతో కవిత దూరంగా ఉన్నారని అంటున్నారు. 


Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?


టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు ఎప్పుడూ గుంభనంగానే ఉంటాయి. బయటకు రావు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కూడా ఇలాంటి అంతర్గత రాజకీయాలు ఉన్నాయని.. బయటకు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థఇతుల్ని ఆసరా చేసుకుని విపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్‌లో ముసలం వస్తుందని ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో పరిస్థితులు దారుణంగా ఉంటాయని రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.


Also Read : దగ్గరపడుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ! ప్రస్తుతానికి ఇవీ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి