Heavy Rains In Ap And Telangana: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ ఎండ తీవ్రత, వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలగనుంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో (Telangana) ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. ఇది బలపడి మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అటు, దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై ఆదివారం నాటికి నైరుతి రుతు పవనాలు విస్తరించనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈదురుగాలులతో వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫాను తరహా వాతావరణం ఏర్పడుతుందని, మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర తెలంగాణ మినహా మిగతా ప్రాంతమంతా తేమతో ఉంది. హైదరాబాద్ లో 52 శాతం తేమ నమోదైంది.
హైదరాబాద్ లో భారీ వర్షం
మరోవైపు, హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. అటు, వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: Hyderabad News: నగరంలో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం - 350 మంది నుంచి రూ.80 కోట్లు వసూళ్లు, ముగ్గురి అరెస్ట్