Pre Launch Offer Real Estate Scam In Hyderabad: సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. హైదరాబాద్ (Hyderabad) లాంటి మహా నగరంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరి ఆశ. అలాంటి వారి ఆశలనే ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకే ప్లాట్స్ అంటూ ప్రకటనలతో మోసగిస్తున్నారు. తాజాగా, భాగ్య నగరంలో మరో భారీ ప్రీ లాంచ్ ఆఫర్ (Pre Launch Offer) మోసం వెలుగుచూసింది. 'భారతీ లేక్ వ్యూ' పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి భారతీ బిల్డర్స్ ఛైర్మన్ దూపాటి నాగరాజుతో పాటు ఎండీ శివరామకృష్ణ, సీఈవో నరసింహరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలోని భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ పేరుతో.. అతి తక్కువ ధరకే ప్లాట్స్ అంటూ దాదాపు 350 మంది నుంచి రూ.80 కోట్ల వరకూ వసూలు చేసినట్లు గుర్తించారు. డబ్బులు వసూలు చేసి కూడా నిర్మాణాలు చేపట్టకపోవడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని 'భారతీ లేక్ వ్యూ' పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టి ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట తక్కువ ధరకే ఫ్లాట్స్ అంటూ ప్రచారం చేశారు. తమ సంస్థ 6.23 ఎకరాల్లో నిర్మాణం చేపడుతుందని.. చదరపు అడుగు రూ.3,200కే అంటూ నమ్మబలికారు. ఆకర్షణీయమైన ధరలకే ప్లాట్స్ ఇస్తామని రంగురంగుల బ్రోచర్లు పంపిణీ చేశారు. కొంపల్లిలోని వెంచర్ సైట్ తో పాటు మాదాపూర్ లోని కార్యాలయాల్లో కస్టమర్లతో సమావేశాలు నిర్వహించారు. వీరి మాటలు నమ్మిన దాదాపు 350 మంది డబ్బులు చెల్లించారు. దాదాపు రూ.80 కోట్ల మేర వసూలు చేశారు. అయితే, తమకు ప్లాట్స్ నిర్మిస్తామని చెప్పిన 6.23 ఎకరాల స్థలాన్ని రూ.100 కోట్లకు వేరే వారికి విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు తాము మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.