TTD Released Arjitha Seva Tickets: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు అలర్ట్. ఆగస్ట్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను (Srivari Arjitha Seva Tickets) టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకూ భక్తులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ టిెకెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in సైట్ లో బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలని.. వారికి లక్కీ డిప్ లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. అలాగే, శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 15 నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల చేశారు.
మిగిలిన టికెట్లు ఎప్పుడంటే.?
- ఈ నెల 23న ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల.
- శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆగస్ట్ నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
- అలాగే, ఆగస్ట్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
- వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
- అలాగే, తిరుమల, తిరుపతిల్లో ఆగస్ట్ నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
- ఈ నెల 27న తిరుమల - తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు నవనీత సేవకు సంబంధించి టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
భక్తుల రద్దీ
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వెలుపలి శిలాతోరణం వరకూ దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 6 గంటలు, సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీడీపీ అధికారులు తెలిపారు. లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు చెప్పారు. తితిదే భద్రతాధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, శుక్రవారం 71,510 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. 43,199 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.