Kyrgyzstan Mob Attacks: కిర్గిజిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై మూక దాడులు జరగడం అలజడి సృష్టిస్తోంది. హాస్టల్‌లో కొంతమంది పాకిస్థాన్ విద్యార్థులపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో కొంత మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కేంద్రం...భారత్‌కి చెందిన విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ గదుల్లోనే ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
"మా విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయినా సరే విద్యార్థులు బయటకు రాకపోవడమే మంచిది. ఏమైనా సాయం కావాల్సి వస్తే అక్కడి ఎంబసీని సంప్రదించండి. 0555710041 నంబర్‌కి కాల్ చేయండి"
- భారత రాయబార కార్యాలయం
ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందించారు. కిర్గిజిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులు ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్‌ని కేటాయించారు.
ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం అక్కడ జరిగిన దాడుల్లో ముగ్గురు పాకిస్థాన్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే... ప్రభుత్వం మాత్రం తమకు అలాంటి సమాచారమేమీ అందలేదని వెల్లడించింది. ముగ్గురు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కిర్గిజిస్థాన్, ఈజిప్ట్‌కి చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన గొడవలు జరిగాయని పాకిస్థాన్ ఎంబసీ వెల్లడించింది. బిష్కెక్‌లోని మెడికల్ యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేసినట్టు తెలిపింది. ఈ యూనివర్సిటీల్లో ఎక్కువగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన విద్యార్థులున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనలపై స్పందించారు. అక్కడి విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరించేందుకు ఎంబసీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.